Telangana : దామోదర కేబినెట్ లో ఉన్నారా? లేరా?
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న దామోదర రాజనర్సింహ మౌనంగా ఉంటున్నారు
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న దామోదర రాజనర్సింహ మౌనంగా ఉంటున్నారు. ఆయన పెద్దగా పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ క్రియాశీలకంగా కనిపించడం లేదు. ఆయనలో ఒకరకమైన అసంతృప్తి ఉందని అంటున్నారు. అందుకే ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న టాక్ పార్టీలో వినిపిస్తుంది. సీనియర్ నేతగా పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ యాక్టివ్ గా ఉండాల్సిన దామోదర రాజనర్సింహ ఎందుకో వచ్చిన మంత్రి పదవి పట్ల కూడా సంతృప్తిగా లేరంటున్నారు. గత రెండేళ్ల నుంచి ఆయన మీడియా ముందుకు కానీ, విపక్షాలు చేసే విమర్శలకు సమాధానం చెప్పింది కానీ వేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చు. తనకు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వలేదన్న అసంతృప్తి ఆయనలో ఉందా? అన్న అనుమానం పార్టీ నేతల్లో కలుగుతుంది.
సీనియర్ నేతగా...
దామోదర రాజనర్సింహ తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మూడుపర్యాయాలు మంత్రిగా కూడా పనిచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్రానికే ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి పవర్ సెంటర్ గా మారారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక దళిత ముఖ్యమంత్రి అనే అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా వినిపించేది ఆయన పేరే. కానీ, ముఖ్యమంత్రి పదవికి పోటీ పడాల్సిన వ్యక్తి కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితం అయ్యారు. దామోదర రాజనర్సింహ్మకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉంది. వివిధ అంశాలపై అవగాహన, ధీటుగా మాట్లాడగలిగే సత్తా ఉన్న నాయకుడే. అయినా, కూడా గత రెండేళ్లుగా ఆయన మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్కలకు లభించిన ప్రాధాన్యత తనకు దక్కడం లేదన్న భావనలో ఆయన ఉన్నట్లుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అండగా ఉండాల్సిన సమయంలో....
ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన సమయంలో బీఆర్ఎస్ కు అంతోఇంతో ధీటుగా మాట్లాడగలిగే వ్యక్తే ఇలా సైలంట్ అవ్వడం పార్టీ నేతలకు, కార్యకర్తలకు మింగుడు పడటం లేదు. కాంగ్రెస్ తో రాజనర్సింహ్మ కుటుంబానిది సుమారు ఐదు దశాబ్దాల అనుబంధం. ఆయన తండ్రి కూడా 1967 నుంచి వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ తరుపున ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించిన చరిత్ర ఉంది. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన ఆయన పార్టీ కీలకమైన సీడబ్ల్యూసీలో సభ్యుడిగా అవకాశం లభించినప్పటికీ ఏదో లోటు ఆయనలో కనిపిస్తుంది. వైద్య ఆరోగ్య శాఖ అంటే మంచి శాఖ. మరి శాఖ విషయంలో కాదు కానీ ఆయన అసంతృప్తికి గల కారణాలేంటన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతుంది. మరి దామోదర రాజనర్సింహ ఇప్పటికైనా ప్రభుత్వంలో యాక్టివ్ అయితేనే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కొంత పార్టీకి బలం చేకూరుతుందని అంటున్నారు.