England and India 1sr Test : కుర్రాళ్లోయ్.. కుర్రాళ్లు.. వెర్రెక్కి పోయి ఆడారు
ఇంగ్లండ్ - భారత్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో యువ క్రికెటర్లు ఏమాత్రం తడబడలేదు
ఇంగ్లండ్ - భారత్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో యువ క్రికెటర్లు ఏమాత్రం తడబడలేదు. అనుభవం లేమి అస్సలు మైదానంలో కనిపించలేదు.సీనియర్ ఆటగాళ్లు లేరు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పడంతో కుర్రాళ్లే బరిలోకి దిగారు. టీం ఇండియా టెస్ట్ మ్యాచ్ లో ఏ మేరకు ఫలితాన్ని సాధిస్తుందన్న భయాన్ని తొలి రోజు ఆటలోనే తునాతునకలు చేయగలిగారు. సిరీస్ ప్రారంభమయిన లీడ్స్ మైదానంలో తొలి రోజు కుర్రోళ్లు అదరగొట్టేశారు. ఇద్దరు సెంచరీలు సాధించి భారత్ కు భారీ స్కోరును సాధించిపెట్టారు.
ఇద్దరు వంద పరుగులు చేసి...
శుభమన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేయగా, తాను ఏమాత్రం తగ్గలేదని ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కూడా శతకం కొట్టి తానేంటో నిరూపించుకున్నాడు. టీం ఇండియా మూడు వికెట్లు మాత్రమే మొదటి రోజు కోల్పోయి 359 పరుగులు చేసింది. శుభమన్ గిల్ 127 పరుగులు చేసి క్రీజులో ఇంకా నాటౌట్ గా ఉండగా, ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 101 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ సీనియారిటీని చూపిస్తూ 42 పరుగులు చేశాడు. ఇక రిషబ్ పంత్ 65 పరుగులు చేసి ఇంకా క్రీజులోనే నాటౌట్ గా ఉన్నాడు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ను భారత్ కు ఇవ్వడం పై ఇప్పుడు ఇంగ్లండ్ బాధపడుతుంటుంది.
ఈరోజు కూడా ఇదే జోరు...
అలా ఆడారు మనోళ్లు. సాయి సుదర్శన్ మినహాయించి మిగిలిన వారంతా మంచి పెర్ ఫార్మెన్స్ చూపారు. ఒకవైపు నిదానంగా ఆడుతూనే మరొక వైపు షాట్లు కొడుతూ ఫోర్లు, సిక్సర్లు బాదుతూ బంతితో ఒక ఆటాడుకున్నారు. రెండో రోజు కూడా టీం ఇండియా ఇదే జోరును కొనసాగిస్తే భారత్ ఖచ్చితంగా మ్యాచ్ పై పట్టు బిగిస్తుందని అనుకోవచ్చు. సీనియర్ ఆటగాళ్లు లేకపోయినా ఆ ప్రభావం ఏమాత్రం తమపై పడకుండా ఆడుతున్న మన యంగ్ టీం ఇండియా ఈరోజు కూడా మంచి స్కోరును సాధించి ఇంగ్లండ్ కు వత్తిడి గురి చేయడమే కాకుండా తొలి టెస్ట్ లోనే విజయానికి దగ్గరవ్వాలని ఆశిద్దాం.