T20 World Cup : క్లైమాక్స్ చేరుకున్న వరల్ట్ కప్.. అంచనాలు ఎలా ఉన్నాయంటే?
టీ20 వరల్డ్ కప్ క్లైమాక్స్ కు చేరుకుంది.
టీ20 వరల్డ్ కప్ క్లైమాక్స్ కు చేరుకుంది. సెమీ ఫైనల్స్ ప్రారంభం కానున్నాయి. వరల్డ్ కప్ కోసం నాలుగు జట్లు పోటీ పడుతున్నాయి. ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, భారత్ లు సెమీ ఫైనల్స్ కు చేరుకున్నాయి. ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో జరిగిన కీలక పోరులో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందుకోవడంతో ఇక సెమీ ఫైనల్స్ లో అడుగు పెట్టింది. అయితే అసలు పోరు ఇప్పుడు మొదలయింది. అన్ని జట్లు ఫుల్లు ఫామ్ లో ఉన్నాయి. అందుకే ఇప్పుడు జరిగే ప్రతి మ్యాచ్ ఆద్యంతం టెన్షన్ తెప్పిస్తుందనే చెప్పాలి.
ఈ రెండు జట్లు...
ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలు చెరొక గ్రూపులో ఉండి అన్నింటా గెలిచి ఓటమి లేకుండా సెమీఫైనల్స్ కు చేరుకున్నాయి. న్యూజిలాండ్ మాత్రం ఓడిపోతూ, గెలుస్తూ రన్ రేటు పుణ్యమా అని సెమీ ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. ఇది నిజంగా అదృష్టమే. ఇక భారత్ కూడా గ్రూప్ దశలో అన్నింటా గెలిచి తర్వాత సూపర్ 8 మ్యాచ్ లలో సౌతాఫ్రికాపై ఓటమి పాలయింది. ఇలా ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు మంచి ఫామ్ లో ఉన్నాయని చెప్పాలి. అలాగని వరల్డ్ కప్ వారికే సొంతమవుతుందనుకుంటే పొరపాటు అవుతుంది. క్రికెట్ లో ఆరోజు ఎవరిది పై చేయి అవుతుందో వారిదే విజయం.
రేపు దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్...
రేపు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇది కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. ఇక కోట్లాది మంది భారత అభిమానులు ఎదురుచూస్తున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్ మార్చి 5వ తేదీన జరగనుంది. ఇందులో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖెడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇంగ్లాండ్‌ను ఓడించి ఫైనల్‌కు వెళ్లాలని సూర్య సేన పట్టుదలతో ఉంది. సెమీఫైనల్‌లో గెలిచిన రెండు జట్లు మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే గ్రాండ్ ఫైనల్‌లో తలపడతాయి. ఈసారి భారత్ కనుక కప్పు గెలిస్తే చరిత్ర సృష్టించినట్లే. ఎందుకంటే టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా వరుసగా రెండుసార్లు ఛాంపియన్‌గా నిలవలేదు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్, ఈ ఘనత సాధించి ప్రపంచ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తోంది. మరి ఎవరి గెలుపు అనేది చెప్పడం కష్టమే.