Sanju Samson: నువ్వే మా దేవుడివయ్యా సామీ.. ఎలాంటి మ్యాచ్ ను గెలిపించావ్?

నిజం..ఎవరికైనా ఒక రోజంటూ వస్తుంది. ఆరోజు అది తనదే అవుతుంది. ఆదివారం సంజూ శాంసన్ ది

Update: 2026-03-02 02:30 GMT

నిజం..ఎవరికైనా ఒక రోజంటూ వస్తుంది. ఆరోజు అది తనదే అవుతుంది. ఆదివారం సంజూ శాంసన్ ది. సంజూ శాంసన్ క్రికెట్ జీవితం అంత సులువుగా సాగలేదు.ఎన్ని ఆటుపోట్లు. ఎన్నిసార్లు బెంచ్ కే పరిమితమయ్యాడు. ఎన్ని అవమానాలు. తక్కువ పరుగులకే అవుట్ చేయడంతో సంజూ శాంసన్ పని అయిపోయిందని అందరూ భావించారు. కేరళకు చెందిన 31 ఏళ్ల శాంసన్ ఈడెన్ గార్డెన్స్‌లో మెరిపించాడు. కోల్‌కతా ప్రేక్షకులు హర్షధ్వానాలతో స్టేడియాన్ని కుదిపేశారు. వికెట్లు పడినా అతను ఆత్మవిశ్వాసం కోల్పోలేదు.జట్టు నుంచి తీస్తారు, పెడతారు... తనతో ఆడుకుంటారు... కానీ ఈరోజు... అందరికీ తన బ్యాట్ తో సమాధానం చెప్పాడు. సెమీస్‌లోకి ఒంటిచేత్తో టీం ఇండియా ను తీసుకెళ్లారు. 196 పరుగుల స్కోరు సంజూ శాంసన్ ముందు చిన్న బోయింది.

అందరూ విఫలమయిన వేళ...
అందరు బ్యాటర్లు విఫలమయిన వేళ సంజూ శాంసన్ నిలబడి నిజమై ఆట అంటే ఏంటో విండీస్ కు రుచి చూపించాడు. ఎక్కడా సహనం కోల్పోలేదు. ఓపెనర్ గా వచ్చి చివరి బంతిని బౌండరీకి పంపించిన తర్వాత తన ఇష్ట దైవాన్ని తలచుకున్న తీరు నిజంగా చిరస్మరణీయం.అద్వితీయం. అద్భుతం. ఎందుకంటే.. గెలిచామన్న ఆనందం కంటే.. తన బ్యాటు పనితనంతో ఇండియాను సెమీ ఫైనల్స్ లోకి చేర్చగలిగానన్న కృతజ్ఞతను తన దేవుడికి ప్రార్థించి చెప్పుకున్నాడంటే ఇన్నాళ్లు సంజూ ఎంత మానసిక వేదనకు గురయ్యాడో అర్థమవుతుంది. ఇరగదీస్తారనుకుంటున్న అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ అందరూ నిలబడని చోట తనొక్కడే చాన్నాళ్లు గుర్తుంచుకునే ఇన్నింగ్స్ ఆడాడు
అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో...
అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించడంపై స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ సంతోషం వ్యక్తం చేశాడు. తన జీవితంలోనే ఇదో గొప్ప ఇన్నింగ్స్ అని అభివర్ణించాడు. ఆ దేవుడి దయతోనే ఈ ఇన్నింగ్స్ సాధ్యమైందని చెప్పుకొచ్చాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొంది సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది.ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సంజూ శాంసన్ 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 97 నాటౌట్ గా నిలిచాడు అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన సంతోషం వ్యక్తం చేసిన సంజూ.. కోహ్లీ, రోహిత్, ధోనీ వంటి దిగ్గజాలను చూసే ఇలా ఆడటం నేర్చుకున్నానని తెలిపాడు.
భావోద్వేగానికి గురయి...
'ఈ ఇన్నింగ్స్ నాకు ప్రపంచంతో సమానం. ఇది నా జీవితం. నేను క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పటి రోజు నుంచి దేశం కోసం ఆడాలని కలలు కన్నాను. ఇలాంటి ఇన్నింగ్స్ కోసమే నిరీక్షిస్తున్నాను. నా క్రికెట్ ప్రయాణం చాలా ప్రత్యేకం. ఇందులో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. నేను సాధించగలనా? అని నాకు నేను ఎన్నోసార్లు సందేహించుకున్నాను. కానీ ఈ రోజు నన్ను దీవించినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.నేను చాలా ఏళ్లుగా టీ20 ఫార్మాట్ ఆడుతున్నాను. కోహ్లీ,రోహిత్ శర్మ, ధోనీ వంటి దిగ్గజాల నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆ అనుభవం నాకు ఎంతగానో సహాయపడింది. గొప్ప ఆటగాళ్లు పరిస్థితులకు తగ్గట్టుగా తమ ఆటను ఎలా మార్చుకుంటారో నేను గమనించాను. గత మ్యాచ్‌లో మేం ముందుగా బ్యాటింగ్ చేశాం. కాబట్టి తొలి బంతి నుంచే నేను దూకుడుగా ఆడాను" అని సంజూ భావోద్వేగానికి గురయ్యాడు. శభాష్ సంజూ. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ను అందుకున్నాడు.


Tags:    

Similar News