T20 World Cup Semi Finals : సులువు కాదు.. సోదరా.. కానీ సాధ్యమే
టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్స్ నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.
టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్స్ నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. దక్షిణాఫ్రికా గ్రూప్ దశలోనూ, సూపర్ 8 లోనూ ఓటమి అనేది లేకుండా అన్ని జట్లను ఓడించి నేరుగా సెమీ ఫైనల్స్ కు చేరుకుంది. న్యూజిలాండ్ మాత్రం రన్ రేట్ ఆధారంగా అదృష్టంతో సెమీస్ బెర్త్ దక్కించుకుంది. ఈ మ్యాచ్ లో విజయం దక్షిణాఫ్రికాపై మొగ్గు చూపే అవకాశాలున్నా, సెమీ ఫైనల్స్ లో న్యూజిలాండ్ జట్టు విజృంభిస్తే మరి చివరికి ఎవరిది విజయం అనేది నేడు తేలి ఫైనల్స్ లో బెర్త్ ఖరారవుతుంది.
రేపు సెమీ ఫైనల్స్...
ఇక భారత్ - ఇంగ్లండ్ మధ్య సెమీ ఫైనల్స్ రేపు జరగనుంది. ముంబయి వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇంగ్లండ్ ఇప్పటి వరకూ ఏ మ్యాచ్ లో ఓడిపోకుండా సెమీ ఫైనల్స్ లోకి అడుగు పెట్టింది. భారత్ మాత్రం గ్రూప్ దశలో అన్ని విజయాలతో మొదలు పెట్టి సూపర్ 8 దశలో మాత్రం దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలయింది. దీంతో ఇంగ్లండ్ తో భారత్ గట్టి పోటీని ఎదుర్కొనే అవకాశముంది. ఇంగ్లండ్ జట్టు సమిష్టిగా రాణిస్తూ ఈ విజయాలను అందుకోవడంతో భారత్ జట్టు ఏ మేరకు వారిని నిలువరిస్తుందన్నది చూడాలి.
ఇరు జట్లు బలంగానే...
టీ 20 వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్స్ లో వరసగా మూడోసారి భారత్ - ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. 2022లో మాత్రం టీం ఇండియాను ఇంగ్లండ్ ను సెమీ ఫైనల్స్ లో ఓడించగలిగింది. 2024లో మాత్రం భారత్ ఇంగ్లండ్ ను ఓడించడమే కాకుండా ఛాంపియన్ గా నిలిచింది. మూడు సార్లు ఒకే జట్లు సెమీ ఫైనల్స్ లో పోరాడుతుండటం అరుదైన విషయం. ప్రస్తుతం టీం ఇండియా కూడా మంచి ఫామ్ లోకి వచ్చింది. అభిషేక్ శర్మ కొంత ఆత్మవిశ్వాసంతో బ్యాట్ అందుకుంటే మాత్రం స్కోరు బోర్డు పరుగులు తీస్తుంది. సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్ధిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్ వంటి వారు మంచి జోరుమీదున్నారు. బుమ్రా, పాండ్యా, అర్ష్ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిలు వికెట్లు దొరకబుచ్చుకోవడంలో సక్సెస్ అవుతున్నారు. మరి ఇంగ్లండ్ జట్టును టీం ఇండియా ఎలా అడ్డుకుంటుందన్నది చూడాలి.