ధోని జట్టులో గుంటూరు కుర్రాడు

Update: 2022-12-24 02:26 GMT

ఆంధ్ర యువ ఆటగాడు షేక్ రషీద్ ను ఐపీఎల్ మినీ వేలంపాటలో అదృష్టం వరించింది. అతడు వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ లో మెరవనున్నాడు. శుక్రవారం (డిసెంబర్ 23) జరిగిన ఐపీఎల్-2023 మినీ వేలంలో రషీద్ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఆంధ్రా ప్రీమియర్ లీగ్-2022లో అద్భుతంగా రాణించిన రషీద్ సీఎస్కే టాలెంట్ స్కౌట్ల దృష్టిలో పడ్డాడు. 2022 అండర్-19 ప్రపంచకప్ను గెలుచుకున్న యువ భారత జట్టుకు రషీద్ వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. ప్రపంచకప్ ముగిసిన అనంతరం జరిగిన ఐపీఎల్-2022 మెగా వేలంలో రషీద్ ప్రాంఛైజీల దృష్టిని ఆకర్షిస్తాడని అంతా భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల రషీద్తో పాటు పలువురు అండర్-19 ఆటగాళ్లు మెగా వేలంలో పాల్గొనలేకపోయారు. ఐపీఎల్-2023 మినీవేలంలో మాత్రం రషీద్ ను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది.

ఐపీఎల్కు షేక్ రషీద్ ఎంపికకావడంపై గుంటూరులోని అతని ఇంట్లో సంబరాలు మిన్నంటాయి. కుటుంబసభ్యులతో పాటు చుట్టుపక్కల వారు మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. గుంటూరు జిల్లాలోని ఒక మధ్య తరగతి కుటంబంలో జన్మించాడు షేక్ రషీద్. చిన్నతనం నుంచే క్రికెట్పై మక్కువ పెంచుకున్నాడు. ఈ క్రమంలో తొమ్మిదేళ్లకే అండర్-14 క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అండర్ -19లోనూ సత్తాచాటాడు. ఇక ఐపీఎల్లో ఆడాలన్న రషీద్ కల మినీవేలంతో సాకారమవ్వడంతో అతడిని పలువురు మెచ్చుకుంటూ ఉన్నారు.


Tags:    

Similar News