Asia Cup : మరోసారి భారత్ - పాకిస్తాన్ పోరు... రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే
నేడు ఆసియా కప్ లో ఫైనల్స్ భారత్ - పాకిస్తాన్ ల మధ్య జరగనుంది. దుబాయ్ వేదికగా రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
నేడు ఆసియా కప్ లో ఫైనల్స్ భారత్ - పాకిస్తాన్ ల మధ్య జరగనుంది. దుబాయ్ వేదికగా రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ ఆసియా కప్ లో రెండుసార్లు తలపడిన భారత్ - పాకిస్తాన్ లు మ్యాచ్ లలో భారత్ రెండు మ్యాచ్ లలోనూ విజయం సాధించింది. రెండు మ్యాచ్ లు ఏకపక్షంగా సాగింది. లీగ్ దశలో జరిగిన మ్యాచ్ లో భారత్ పాకిస్తాన్ పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సూపర్ 4 దశలో భారత్ పాక్ పై ఆరు వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. అయితే ఆసియా కప్ లో సుదీర్ఘకాలం తర్వాత భారత్ - పాకిస్తాన్ లు ఫైనల్స్ లో తలపడుతుండటంతో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. హోరా హోరీ పోరు తప్పదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ఓటమి ఎరుగని...
ప్రస్తుతం భారత్ మాత్రం ఆసియా కప్ లో ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. బ్యాటింగ్, బౌలింగ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న జట్టు భారత్ మాత్రమే. అందుకే ఆసియా కప్ లో జరిగిన అన్ని మ్యాచ్ లలో భారత్ విజయం సాధించింది. అన్నీ గెలుపులే పలకరించాయి. దీంతో ఫైనల్స్ కూడా తమ పక్షాన నిలుస్తుందని టీం ఇండియా గట్టిగా విశ్వసిస్తుంది. ఎటువంటి మార్పులు లేకుండానే భారత్ జట్టు బరిలోకి దిగే అవకాశముంది. తొలుత బ్యాటింగ్ చేసినా, ఫీల్డింగ్ చేసినా చివరకు ఫలితం భారత్ వైపు మొగ్గు చూపుతుంది. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో పాటు బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉండటంతో భారత్ జట్టును పాక్ ఎదుర్కొనడం కష్టమేనన్నది విశ్లేషకుల అంచనా.
పాకిస్తాన్ బలహీనంగా ఉన్నా...
అయితే పాకిస్తాన్ కూడా ఇప్పటి వరకూ ఇండియా మీద మాత్రమే ఓడింది. మిగిలిన అన్ని జట్లను ఓడించింది. దీంతో ఈసారి భారత్ ను ఫైనల్స్ లో ఓడించి ఛాంపియన్ ట్రోఫీని పట్టుకెళతామన్న ధీమాలో ఉంది. బ్యాటింగ్ పరంగా కొంత బలహీనంగానే ఉన్న జట్టు ఇది. అదే బౌలింగ్ పరంగా కాస్త మెరుగ్గా ఉంది. అయితే మైదానంలో అప్పుడు ఎవరు ఎలా ఆడతారన్నది అప్పటికప్పుడు తేలాల్సి ఉంది. ఫైనల్ మ్యాచ్ లలో పాకిస్తాన్ తో భారత్ పది సార్లు తలపడితే టీం ఇండియా కేవలం మూడుసార్లు మాత్రమే గెలిచిందని పాక్ ధీమా. కానీ నాటి జట్లు వేరు. నేడు టీం ఇండియా వేరన్నది గుర్తుంచుకోవాలని క్రీడానిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద ఈరోజు జరిగే మ్యాచ్ మాత్రం రోమాలు నిక్కబొడిచేలా చివర వరకూ టెన్షన్ పెట్టే అవకాశముందన్న అంచనాలు వినపడుతున్నాయి.