Tilak Varma : హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మపై దేశం ప్రశంసలు.. హైదరాబాద్ లో ఘన స్వాగతం

ఆసియా కప్ ఫైనల్‌లో టీం ఇండియాకు విజయాన్ని చేకూర్చిన క్రికెటర్ తిలక్ వర్మకు హైదరాబాద్ లో ఘన స్వాగతం పలికారు

Update: 2025-09-30 02:16 GMT

ఆసియా కప్ ఫైనల్‌లో టీం ఇండియాకు విజయాన్ని చేకూర్చిన క్రికెటర్ తిలక్ వర్మకు హైదరాబాద్ లో ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్‌ యువ క్రికెటర్‌ తిలక్ వర్మ మరోసారి తన ఆటతీరుతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాడు. ఆదివారం రాత్రి ఆసియా కప్‌ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత విజయానికి ఆయన కీలకంగా నిలిచాడు. ఈ ప్రదర్శనతో అన్ని ఫార్మాట్లలో భారత్‌ తరఫున ఆడగల సామర్థ్యం తనకుందని మరోసారి రుజువు చేశాడు.ఈ 22 ఏళ్ల ఈ యువ బ్యాట్స్‌మన్‌ ఇప్పటికే భారత్‌ టీ–20 జట్టులో స్థానాన్ని సుస్థిరపర్చుకుని తన ప్రతిభ చాటుకున్నాడు.

టెస్ట్ క్రికెట్ లో అడుగు పెట్టడం కోసం...
టెస్ట్‌ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న తిలక్‌ రెడ్‌బాల్‌ క్రికెట్‌లోనూ రాణిస్తున్నాడు. అయితే ఫైనల్లో ఒత్తిడి పరిస్థితుల్లో ఆడిన ఇన్నింగ్స్‌ అతడి ఆటను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లిందని క్రీడా నిపుణులు తెలిపారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడడం ప్రారంభించిన తర్వాత తిలక్‌ ఆట తీరు, ఫిట్ నెస్, మైండ్‌సెట్‌లో స్పష్టమైన మార్పు వచ్చిందని వారు గుర్తుచేశారు. సౌతాఫ్రికాపై గత నవంబరులో సాధించిన వరుస శతకాలు దీనికి నిదర్శనమని వారు అభిప్రాయపడ్డారు. ఫైనల్లో హారిస్‌ రౌఫ్‌ వేసిన బంతిని స్క్వేర్‌ లెగ్‌ మీదుగా సిక్స్‌ కొట్టి భారత్‌కు విజయాన్ని సులభం చేయడం తిలక్‌ ఆత్మవిశ్వాసానికి నిదర్శనమైంది.తిలక్ వర్మ టీం ఇండియాకు అందించిన విజయాన్ని యావత్ దేశం ఎన్నటికీ మర్చిపోదు.
నిలకడగా.. అటాకింగ్...
ఆటలో కేవలం అటాకింగ్‌ షాట్లు మాత్రమే కాకుండా జట్టు పరిస్థితిని అర్థం చేసుకుని తన పాత్రను ఖచ్చితంగా నెరవేర్చడం తిలక్‌ ప్రత్యేకత. ఫైనల్లో టాప్‌ ఆర్డర్‌ విఫలమైన తర్వాత చిత్తశుద్ధిగా బ్యాటింగ్‌ చేయడం ఇందుకు ఉదాహరణ. ఈ ప్రదర్శనపై జట్టు హెడ్‌కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ సంతోషం వ్యక్తం చేశారని తెలిసింది. తిలక్‌ విజయానికి తల్లిదండ్రులు నాగరాజు, గాయత్రి దేవి ప్రోత్సాహం, అలాగే లింగంపల్లి లెగల క్రికెట్‌ అకాడమీకి చెందిన కోచ్‌ సలాం బయ్యాష్‌ నమ్మకం ముఖ్య కారణమని వర్గాలు చెబుతున్నాయి. “మన కష్టానికి ఫలితం దొరుకుతుందనడానికి తిలక్‌ ప్రదర్శన ఉత్తమ ఉదాహరణ” అని కోచ్‌ఆనందం వ్యక్తం చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన తిలక్ వర్మకు ఘనస్వాగతం లభించింది.


Tags:    

Similar News