Asia Cup : బంగ్లాను ఓడించి నేరుగా ఫైనల్స్ లోకి ప్రవేశించిన భారత్.. బ్యాటింగ్ లో తడబడినా?

ఆసియా కప్ లో టీం ఇండియా ఫైనల్స్ కు సగర్వంగా చేరుకుంది. బంగ్లాదేశ్ పై అద్భుతమైన విజయం సాధించింది

Update: 2025-09-25 01:49 GMT

ఆసియా కప్ లో టీం ఇండియా ఫైనల్స్ కు సగర్వంగా చేరుకుంది. బంగ్లాదేశ్ పై అద్భుతమైన విజయం సాధించింది. తలెత్తుకుని మరీ తమకు తిరుగులేదని ఫైనల్స్ లోకి నేరుగా ప్రవేశించింది. ఆసియా కప్ లో ఇప్పటి వరకూ ఏ మ్యాచ్.. ఏ దేశంతో ఆడినప్పటికీ విజయం ఇండియాదేనని చాటి చెప్పింది. టీ20లలో తమకు ఎదురు లేదని కాలరెగరేసి మరీ చెప్పి మరీ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. ఇప్పటి వరకూ ఆసియాకప్ లో ఐదు మ్యాచ్ లు ఆడి ఐదు మ్యాచ్ లలో అద్భుతమైన ప్రదర్శన చేసిన టీం ఇండియాను ఏ జట్టు ఓడించలేకపోయింది. బంగ్లాదేశ్ ఒక దశలో కొంత కలవరపెట్టినప్పటికీ చివరకు టీం ఇండియా విజయం సొంతం చేసుకుంది. ఆసియా కప్ లో తమతో గేమ్ అంటే ఆషామాషీ కాదని అన్ని జట్లకు బ్యాట్ తోనూ, బాల్ తోనూ రుచి చూపించగలిగింది.

తొలుత బ్యాటింగ్ చేసినా...
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ లో ఓపెనర్లు ఇద్దరూ బంగ్లా బౌలర్లను ఒక ఆటాడుకున్నారు. అభిషేక్ శర్మ మరోసారి సూపర్ ఇన్నింగ్స్ ఆడి 75 పరుగులు చేశాడు. శుభమన్ గిల్ 29 పరుగులకే అవుటయ్యాడు. శివమ్ దుబె రెండు, సూర్యకుమార్ ఐదు పరుగులు చేసి అవుటయ్యాడు. అభిషేక్ శర్మ, గిల్ క్రీజులో ఉన్న సమయంలో భారత్ జోరును చూసి రెండు వందలకు పైగా పరుగులు చేస్తుందని భావించారు. కానీ వరసగా భారత బ్యాటర్లు విఫలం కావడంతో అతి తక్కువ పరుగులు చేయాల్సి వచ్చింది. చివరకు హార్ధిక్ పాండ్యా38 పరుగులు, అక్షర్ పటేల్ పది పరుగులు చేసి నాటౌట్ గా నిలవడంతో భారత్ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 168 పరుగులు మాత్రమే చేయగలిగింది. నిజానికి భారత్ దూకుడుకు ఇది తక్కువ స్కోరు అని చెప్పాలి.
సైఫ్ హసన్ ప్రయత్నించినా...
169 లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ ఆదిలో కొంత భయపెట్టింది. సైఫ్ హసన్ సిక్సర్లతో మోత మోగించాడు. సైఫ్ హసన్ 68 పరుగులు చేయగలిగాడు. తంజిద్ హసన్ ఒకటి, పర్వేజ్ ఎమాన్ ఇరవై ఒక్క పరుగుల చేశారు. హృదోయ్ ఏడు, షమీమ్ డకౌట్ అయ్యాడు. కెప్టెన్ జెకర్ ఆలీ రనౌట్ కావడంతో భారత్ వైపు విజయం తొంగిచూస్తున్నట్లు అనిపించినా సైఫ్ హసన్ క్రీజులో ఉండటంతో లక్ష్యాన్ని అధిగమించే అవకాశాలను ఎవరూ కొట్టిపారేయలేదు. కానీ సైఫ్ హసన్ కు మరొక బంగ్లా బ్యాటర్ సహకరించలేదు. అతనికి స్ట్రయికింగ్ ఇచ్చి తాము నిదానంగా ఆడాలని ప్రయత్నించలేదు. దీంతో వరసగా బంగ్లా వికెట్లు పోగొట్టుకుంది. భారత్ బౌలర్లలో బుమ్రా రెండు, వరుణ్ చక్రవర్తి రెండు, కుల్ దీప్ యాదవ్ మూడు, అక్షర్ పటేల్ ఒకటి, తిలక్ వర్మ ఒక వికెట్ తీసి బంగ్లాను దెబ్బతీశారు. భారత్ నేరుగా ఫైనల్స్ లోకి ప్రవేశించినట్లయింది.
Tags:    

Similar News