భారత్–పాక్ ఉద్రిక్తతల ప్రభావం ఇంగ్లండ్ క్రికెట్‌పై ఉండనుందా?

భారత్–పాకిస్థాన్ మధ్య ఉన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పుడు ఇంగ్లండ్ క్రికెట్ పోటీలపై కూడా ప్రభావం చూపుతున్నాయనే చర్చ మొదలైంది

Update: 2026-02-25 02:35 GMT

భారత్–పాకిస్థాన్ మధ్య ఉన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పుడు ఇంగ్లండ్ క్రికెట్ పోటీలపై కూడా ప్రభావం చూపుతున్నాయనే చర్చ మొదలైంది. ఇంగ్లండ్‌లో నిర్వహించే తాజా టోర్నీ ‘ది హండ్రెడ్’లో పాక్ ఆటగాళ్ల ఎంపికపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలోని ఎనిమిది జట్లలో నాలుగు జట్లకు భారత పెట్టుబడిదారులు వాటాలు కలిగి ఉన్నారు. వారు ఐపీఎల్ జట్లను కూడా నిర్వహిస్తున్నారు. 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత నుంచి ఐపీఎల్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు ఆడలేదు.

బీబీసీ నివేదిక ప్రకారం...
బీబీసీ నివేదిక ప్రకారం, ‘ది హండ్రెడ్’లో ఐపీఎల్ యజమానుల ఆధ్వర్యంలోని మాంచెస్టర్ సూపర్ జెయింట్స్, ఎంఐ లండన్, సదర్న్ బ్రేవ్, సన్‌రైజర్స్ లీడ్స్ జట్లు మార్చి 11–12 తేదీల్లో జరిగే వేలంలో పాక్ ఆటగాళ్లను పరిగణలోకి తీసుకోబోవని సమాచారం. ఈ అంశంపై ఆ నాలుగు జట్లు అధికారికంగా స్పందించలేదు.గత సంవత్సరం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గోల్డ్ మాట్లాడుతూ, ఐపీఎల్ వంటి లీగ్‌ల్లో పాక్ ఆటగాళ్లపై ఉన్న పరిమితుల గురించి తమకు తెలుసని చెప్పారు. అయితే ‘ది హండ్రెడ్’లో అలాంటి పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు.
ఎనిమిదింటికి...
అయితే తాజాగా ఈసీబీ ఎనిమిది ఫ్రాంచైజీలకు ఈమెయిల్ పంపింది. జట్ల బాధ్యతలను గుర్తు చేసింది. జాతీయత ఆధారంగా ఆటగాళ్లను పక్కన పెట్టడం వంటి వివక్షకు ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అవసరమైతే ఈ విషయాన్ని క్రికెట్ రెగ్యులేటర్‌కు పంపించే అవకాశం ఉందని బ్రిటన్ ప్రెస్ అసోసియేషన్ తెలిపింది. ‘ది హండ్రెడ్’ పోటీపై పూర్తి యాజమాన్యం ఈసీబీ వద్దే ఉంది. అయితే దేశీయ క్రికెట్ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో భారీగా నిధులు సమీకరించేందుకు భారత్, అమెరికా పెట్టుబడిదారులకు వాటాలు విక్రయించింది.
వేలంలో 964 మంది...
ఈ ఏడాది వేలంలో మొత్తం 964 మంది ఆటగాళ్లు ఉన్నారు. వారిలో 67 మంది పాకిస్థాన్‌కు చెందినవారు. వీరిలో 63 మంది పురుషులు, నలుగురు మహిళలు. గత ఏడాది వేలంలో ఒక్క పాక్ ఆటగాడినీ ఎంపిక చేయలేదు. అయితే మొహమ్మద్ అమీర్, ఇమాద్ వసీమ్ ప్రత్యామ్నాయ ఆటగాళ్లుగా పాల్గొన్నారు. 2025 సీజన్‌లో పాకిస్థాన్ అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా కొంతమంది ప్రముఖ ఆటగాళ్లు అందుబాటులో లేరు. ఈసారి ‘ది హండ్రెడ్’ జరుగుతున్న సమయంలో వెస్టిండీస్‌లో రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. టోర్నీ ముగిసిన వెంటనే ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల సిరీస్ ప్రారంభమవుతుంది. ఇంతకుముందు షాహీన్ షా అఫ్రిది, హారిస్ రౌఫ్ (వెల్ష్ ఫైర్), షాదాబ్ ఖాన్ (బర్మింగ్‌హామ్ ఫీనిక్స్), ఇమాద్ వసీమ్ (ట్రెంట్ రాకెట్స్), మొహమ్మద్ అమీర్ (ఓవల్ ఇన్విన్సిబుల్స్) వంటి పాక్ ఆటగాళ్లు ఈ పోటీలో ఆడారు.
2012 తర్వాత...
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్ల కెప్టెన్ హ్యారీ బ్రూక్ సన్‌రైజర్స్ లీడ్స్ తరఫున అత్యధిక పారితోషికం తీసుకున్న ఆటగాడిగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. పాక్ ఆటగాళ్లను తప్పిస్తే అది దురదృష్టకరమని అన్నాడు. “పాకిస్థాన్ గొప్ప క్రికెట్ దేశం. అక్కడి ఆటగాళ్లు ప్రపంచంలోనే అత్యుత్తములు” అని టీ20 ప్రపంచకప్ సందర్భంగా పేర్కొన్నారు. 2026 ‘ది హండ్రెడ్’ సీజన్ జూలై 21 నుంచి ఆగస్టు 16 వరకు నిర్వహించనున్నారు. యువతను ఆకర్షించేందుకు 2021లో ఈ టోర్నీ ప్రారంభించారు.భారత్–పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ 2012లో పాకిస్థాన్ భారత్ పర్యటన తర్వాత నిలిచిపోయింది.


Tags:    

Similar News