T20 World Cup : దక్షిణాఫ్రికా దెబ్బకు చిత్తుగా ఓడిన టీం ఇండియా

టీం ఇండియా దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడింది.

Update: 2026-02-23 02:37 GMT

భయపడినట్లే జరిగింది. అందరూ ఊహించినట్లుగానే సూపర్ 8 లో భారత్ చేతులెత్తేసింది. టీం ఇండియా దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడింది. గ్రూపు దశలో నాలుగు మ్యాచ్ లలో గెలిచారంటే.. ఎవరో ఒకరు ఆదుకోబట్టే. కానీ ఇప్పుడు అందరి వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడింది. బ్యాటర్లందరూ దాదాపు ఫామ్ లో లేరని అర్ధమయింది. ఇషాన్ కిషన్ ఇరగదీస్తాడనుకుంటే వెంటనే అవుటయ్యాడు. అభిషేక్ శర్మలో ఏ మాత్రం మార్పు లేదు. సూర్యకుమార్ యాదవ్ అంతే. తిలక్ వర్మ సయితం ఫామ్ లో లేడని అర్థమయింది. ఇక ఇదే రీతిలో కొనసాగిస్తే టీం ఇండియా సెమీస్ కు కూడా చేరుకోవడం కష్టమే అవుతుంది. భారీ స్కోరుతో ఇంత అపజయాన్ని మూటగట్టుకున్న టీం ఇండియా అన్ని విభాగాల్లో మంచి పనితీరు చూపితే తప్ప సెమీస్ సాధ్యం కాదన్నది నిన్న మ్యాచ్ చూసిన తర్వాత తేలిపోయింది.

భారీ పరుగులతో ఓటమి...
దక్షిణాఫ్రికా జట్టుపై భారత్ 76 పరుగులతో ఓడిపోయింది. దీంతో రన్ రేట్ కూడా పూర్తిగా తగ్గింది. టాస్ గెలిచి దక్షిణాఫ్రికా జట్టును తొలి ఓవర్లలోనే బుమ్రా, అర్షదీప్ సింగ్ లు మూడు వికెట్లు తీసుకున్నా తర్వాత మాత్రం వారి దూకుడును ఎవరూ ఆపలేకపోయారు. భారత్ మంచి ఆరంభాన్ని ఇచ్చినప్పటికీ తర్వాత మాత్రం వికెట్ తీయడానికి కష్టపడాల్సి వచ్చింది. అర్షదీప్ సింగ్ రెండు, జస్ప్రిత్ బుమ్రా మూడు, వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ తీసుకున్నప్పటకీ దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో187 పరుగులను చేయడం అంటే ఆషామాషీ కాదు. డేవిడ్ మిల్లర్ దూకును ఎవరూ ఆపలేకపోయారు. మిల్లర్ 63 పరుగులు చేశాడు. బ్రెవిస్ 45 పరుగులు చేయగలిగాడు.
భారీ స్కోరును ఛేదించలేక...
కానీ భారత్ మాత్రం అంతటి స్కోరు ను ఛేదించడంలో చేతులెత్తేసింది. ఇషాన్ కిషన్ డకౌట్ అయ్యాడు. అభిషేక్ శర్మ పదిహేను, సూర్యకుమార్ యాదవ్ పద్దెనిమిది పరుగులు, మాత్రమే చేశాడు. శివం దూబె చేసిన పోరాటం ఫలించ లేదు. శివం దూబె 43 పరుగులు చేసి పరవాలేదనిపించినా అప్పటికే ఒత్తిడి అధికమయింది. 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి అవసరమైన పరుగులు చేయలేదని ఎవరికైనా తెలిసిపోతుంది. తిలక్ వర్మ ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. ఇలా అందరి వైఫల్యంతో టీం ఇండియా సరైన సమయంలో చేతులెత్తేసింది. ఇక సెమీస్ కు భారత్ చేరాలంటే దక్షిణాఫ్రికా, జింబాబ్వే మీద గెలవాల్సిందే. ఇప్పుడున్న టీం ఇండియా ఫామ్ చూస్తే ఇది కష్టంగానే కనిపిస్తుంది. ఆతిధ్య జట్లు శ్రీలంక అక్కడ ఇంగ్లండ్ చేతిలో ఓడిపోగా, ఇక్కడ దక్షిణాఫ్రికా చేతిలో దెబ్బతినింది. హాట్ ఫేవరెట్ గా అడుగుపెట్టిన టీం ఇండియాకు ముందుంది కష్టాలేనని చెప్పాలి.


Tags:    

Similar News