T20 World Cup : సెమీస్‌కు ఇంగ్లండ్‌… పాక్ ఇక ఇంటికే

టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ సెమీఫైనల్‌కు చేరింది

Update: 2026-02-25 02:22 GMT

టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ సెమీఫైనల్‌కు చేరింది. కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ అద్భుత శతకంతో జట్టును గెలిపించాడు. పాకిస్థాన్‌పై జరిగిన కీలక మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ రెండు వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన ఇంగ్లండ్‌ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. 35 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. తర్వాత 58 పరుగులకు 4 వికెట్లు అయ్యాయి. అయితే బ్రూక్‌ ఒంటరి పోరాటంతో జట్టును ముందుకు నడిపించాడు. ఐదు బంతులు మిగిలుండగానే రెండుసార్లు ఛాంపియన్‌ అయిన ఇంగ్లండ్‌ లక్ష్యాన్ని అందుకుంది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ సెమీ ఫైనల్స్ కు వెళ్లగా, పాకిస్తాన్ దాదాపు ఇంటిదారి పట్టినట్లే నని భావించాలి. పాకిస్థాన్‌పై రెండు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది.

సమయోచితంగా ఆడి...
బ్రూక్‌ 51 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఇది అతని టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో తొలి శతకం. అలాగే టి20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌గా నమోదైన అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే. ప్రస్తుత టీ20లలో సెమీస్‌ చేరిన తొలి జట్టుగా కూడా ఇంగ్లండ్‌ నిలిచింది. వరుసగా ఐదోసారి టి20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. మూడో స్థానంలో మొదటిసారి బ్యాటింగ్‌ చేసిన బ్రూక్‌ సమయోచితంగా ఆడాడు. పది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో ఇన్నింగ్స్‌ను అలంకరించాడు. స్పిన్నర్లపై దూకుడుగా ఆడుతూ మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. సైమ్‌ అయూబ్‌, మొహమ్మద్‌ నవాజ్‌, షాదాబ్‌ అహ్మద్‌లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. మైదానం చుట్టూ బంతిని పరుగులు తీయించి పదమూడు సార్లు రెండు పరుగులు తీశాడు.
బ్రూక్ సెంచరీతో...
నవాజ్‌ వేసిన ఒక ఓవర్‌లో 17 పరుగులు సాధించాడు. అందులో ఒక సిక్స్‌, రెండు ఫోర్లు ఉన్నాయి. కవర్‌ వైపు ఇన్నర్‌ ఎడ్జ్‌తో కొట్టిన షాట్‌ ప్రేక్షకులను అలరించింది. ఉస్మాన్‌ తారిఖ్‌ ను ఉతికి ఆరేశారు. నాలుగు ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. షాహీన్‌ షా అఫ్రిది నాలుగు వికెట్లు తీశాడు. ప్రారంభ స్పెల్‌లో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను కుదిపాడు. అయితే బ్రూక్‌ మాత్రం తన శతకాన్ని సిక్స్‌తో పూర్తి చేశాడు. తర్వాత అఫ్రిది బౌలింగ్‌లో మూడో భారీ షాట్‌కు యత్నించి బౌల్డ్‌ అయ్యాడు. అప్పటికే ఇంగ్లండ్‌కు సెమీస్‌ బెర్త్‌ ఖాయం చేశాడు. తారిఖ్‌ చివరి ఓవర్‌లో హాఫ్‌ ట్రాకర్‌ బంతిని బ్రూక్‌ స్క్వేర్‌ లెగ్‌ మీదుగా సిక్స్‌గా మలిచాడు. తర్వాతి బంతికి బౌండరీ సాధించాడు. దీంతో మ్యాచ్‌ దాదాపు ముగిసినట్లే అయింది.
తక్కువ పరుగులకే పాక్...
బ్రూక్‌ ఔట్‌ అయిన తర్వాత నవాజ్‌ జాక్స్‌, జేమీ ఓవర్టన్‌లను ఔట్‌ చేశాడు. చివరి ఓవర్‌ తొలి బంతిని జోఫ్రా ఆర్చర్‌ బౌండరీకి తరలించి ఇంగ్లండ్‌ను చివరి నాలుగులోకి చేర్చాడు.పాకిస్థాన్‌ కెప్టెన్‌ ఆఘా సల్మాన్‌ బౌలింగ్‌ మార్పుల్లో జాగ్రత్తగా వ్యవహరించలేకపోయాడు. అంతకుముందు పాకిస్థాన్‌ 9 వికెట్లకు 164 పరుగులు చేసింది. నెమ్మదైన పిచ్‌పై సహిబ్‌జాదా ఫర్హాన్‌ 45 బంతుల్లో 63 పరుగులతో రాణించాడు. 7 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ఇంగ్లండ్‌ స్పిన్నర్లు ఎక్కువసేపు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. ఎడమచేతి స్పిన్నర్‌ లియామ్‌ డాసన్‌ 24 పరుగులకు 3 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. 18వ ఓవర్‌లో వరుసగా రెండు వికెట్లు తీసి పాకిస్థాన్‌ స్కోరు 175 దాటకుండా అడ్డుకున్నాడు. మొత్తం మీద ఇంగ్లండ్ సెమీస్ కు చేరుకోగా పాకిస్తాన్ దాదాపుగా ఈ పోటీ నుంచి నిష్క్రమించినట్లేనని అనుకోవాల్సింది.


Tags:    

Similar News