Team India : సెమీస్ చేరాలంటే టీం ఇండియాకు ఆ సెంటిమెంట్ పనిచేస్తుందా?

టీం ఇండియా సౌతాఫ్రికాపై ఓటమిని ఫ్యాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు.

Update: 2026-02-25 04:28 GMT

టీం ఇండియా సౌతాఫ్రికాపై ఓటమిని ఫ్యాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు. అసలు సెమీ ఫైనల్స్ లో అడుగు పెడతామా? లేదా? అన్న అనుమానం చాలా మందిలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు జట్టులో ఫామ్ లో లేని వాళ్లే అధికంగా ఉండటమే ఈ ఆందోళనకు, అనుమానానికి కారణం. 2024లో ఛాంపియన్ గా నిలిచిన భారత్ రెండేళ్లకు ఇలా అయిపోయిందేమిటన్న బాధ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. సీనియర్ ఆటగాళ్లు లేని కొరత ఖచ్చితంగా కొట్టొచ్చినట్లు కనపడుతుంది. వికెట్లు పడిపోయిన సమయంలో గతంలో సీనియర్ ఆటగాళ్లు వికెట్ పడిపోకుండా స్కోరును భారత్ విజయం వైపు తీసుకెళ్లిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. కానీ నేటి జట్టులో అందరూ అనవసర షాట్లు ఆడుతూ వికెట్లు సమర్పించుకుంటూ తర్వాత వారిపై వత్తిడిని మరింత పెంచుకతున్నారు.

పంధొమ్మిదేళ్ల నాటి సెంటిమెంట్...
అయితే టీమిండియాకు పంధొమ్మిది ఏళ్ల నాటి సెంటిమెంట్ కలిసొస్తుందన్న విశాస్వం కూడా ఉంది. 2007లో కూడా ఇలాగే ప్రపంచ కప్ లో జరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సరిగ్గా 19 ఏళ్ల క్రితం అంటే 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్‌లో కూడా టీమిండియా పరిస్థితి ఇలాగే కనిపించింది. అప్పుడు కూడా గ్రూప్ స్టేజ్‌లో అదరగొట్టిన భారత్, సూపర్-8లో తన తొలి మ్యాచ్‌ను న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. ఆ ఓటమితో అప్పట్లో కూడా అందరూ భారత్ పని అయిపోయిందని అనుకున్నారు. కానీ అక్కడే అసలు మలుపు తిరిగింది. ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలపై వరస విజయాలు సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది. ఆపై సెమీస్‌లో ఆస్ట్రేలియాను, ఫైనల్లో పాకిస్థాన్‌ను మట్టికరిపించి తొలి టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుందన్న విషయాన్ని మర్చిపోవద్దని చెబుతున్నారు.
రెండు టీంలు పటిష్టంగానే...
ప్రస్తుతం 2026 వరల్డ్ కప్‌లోనూ అలాగే కనిపిస్తుందని కొంత ఆశ అయితే భారత అభిమానుల్లో కనిపిస్తుంది. సూపర్-8లో తొలి మ్యాచ్‌ లో సౌతాఫ్రికా పై ఓడిన భారత్, ఇప్పుడు 2007 నాటి మ్యాజిక్‌ను రిపీట్ చేసే అవకాశం ఉందంటున్నారు. అయితే రానున్న రోజుల్లో టీమిండియా జింబాబ్వే, వెస్టిండీస్‌లను చిత్తుగా ఓడించాల్సి ఉంటుంది. ఒకవేళ భారత్ ఈ రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు నమోదు చేస్తే, సెమీస్ చేరడం ఖాయం. అదే జరిగితే, 19 ఏళ్ల క్రితం నాటి ఓటమి సెంటిమెంట్ భారత్‌కు మళ్ళీ వరల్డ్ కప్ తెచ్చిపెడుతుందన్న జోస్యం వినపడుతుంది. జింబాబ్వే ప్రస్తుతం చాలా పటిష్టంగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియానే ఇంటికి పంపిన జింబాబ్వేను తక్కువ అంచనా వేయడం మంచిది కాదు. అలాగే వెస్టిండీస్ సొంత గడ్డపై ఎప్పుడూ ప్రమాదకరమే. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు తన తప్పులను సరిదిద్దుకుని ఆడితే సెమీస్ కు వెళ్లేందుకు మార్గం సులువుగా మారుతుంది. ఏ మాత్రం ఇదే నిర్లక్ష్యపు ఆటను ప్రదర్శిస్తే మాత్రం ఇక ఇంటికి వెళ్లడం తప్పదు.


Tags:    

Similar News