T20 World Cup : భారత్ నెదర్లాండ్స్ పై నెగ్గింది కానీ... ముందుంది క్రొకైడైల్ ఫెస్టివల్
టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌పై భారత్ విజయం సాధించింది.
టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌పై భారత్ విజయం సాధించింది. అయితే ముందుంది అసలు సమస్య. నెదర్లాండ్ పై నెగ్గడానికి టీం ఇండియా చెమటోడ్చింది. బ్యాటింగ్ టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమయింది. బౌలింగ్ లో కూడా అంత పదును కనిపించలేదు. ఒక దశలో నెదర్లాండ్స్ నెగ్గుతుందని పించింది. కానీ శివమ్ దూబె, వరుణ్ చక్రవర్తిల సహకారంతో చివరకు పదిహేడు పరుగులతో చచ్చీ చెడీ గెలిచినట్లయింది. గ్రూపు ఏలో అన్ని మ్యాచ్ లు గెలిచిన టీం ఇండియాపై ఇక రరానున్న కాలంలో సౌతాఫ్రికా, జింబాబ్వే మీద ఆడాల్సి ఉంది. ఒకరకంగా నెదర్లాండ్ చేసిన పోరాటానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. పాక్ మీద సులువుగా గెలిచిన టీం ఇండియా నెదర్లాండ్స్ మీద మాత్రం కష్టపడిందనే చెప్పాలి. ముందుంది క్రొకొడైల్ ఫెస్టివల్.. అన్నట్లు తయారయింది టీం ఇండియా పరిస్థితి.
దూబె విజృంభించడంతో...
టీ20 ప్రపంచకప్‌లో భారత్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బుధవారం ఇక్కడ జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై 17 పరుగుల తేడాతో గెలిచింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది. టాస్ గెలిచి భారత్ తొలుత బ్యాటింగ్ ను ఎంచుకుంది. అభిషేక్ శర్మ ఎప్పటి లాగే పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్ బ్యాడ్ లక్ తో అవుటయ్యాడు. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ లు పరవాలేదనిపించినా ఆశించిన మేరకు రాణించలేదు. అయితే శివమ్ దూబె నిలబడి 66 పరుగులు చేసి భారత్ పరువును నిలబెట్టాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. శివమ్ దూబె 31 బంతుల్లో 66 పరుగులు చేసి జట్టుకు బలమైన స్కోరు అందించాడు. ఇషాన్ కిషన్ 18, తిలక్ వర్మ 31, సూర్యకుమార్ యాదవ్ 34 కీలక పరుగులు చేశారు. హార్దిక్ పాండ్యా తో కలిసి దూబె ఐదో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
నెదర్లాండ్స్ పోరాడి ఓడి...
నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్ 2 వికెట్లు తీసి మెరుగైన ప్రదర్శన చేశాడు. లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులకే పరిమితమైంది. బాస్ డి లీడే 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివరి వరకు పోరాడినా జట్టును గెలుపు తీరానికి తీసుకెళ్లలేకపోయాడు. వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీసి మ్యాచ్‌ను భారత్ వైపు మళ్లించాడు. దూబె కూడా 2 వికెట్లు సాధించాడు. టోర్నీలో భారత్ వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. అయితే తర్వాతి రోజుల్లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే వంటి దేశాలపై భారత్ ఎలా నెగ్గుకొస్తుందోనన్న టెన్షన్ మాత్రం ఈ మ్యాచ్ ను చూసిన భారత్ అభిమానులకు ఎవరికైనా కలుగుతుంది. అందుకే బ్యాటింగ్ లో రాటు దేలడం, బౌలింగ్ కు మరింత పదును పెట్టడం, ఫీల్డింగ్ లో మెలుకువలు మరింత పకడ్బందీగా ఉంటేనే మిగిలిన అగ్రశ్రేణి జట్టుపై టీం ఇండియా నెగ్గుకు రాగలదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.