ప్రపంచ క‌ప్ టీమ్‌లో ఒక్క వికెట్ కూడా తీయని 'బౌల‌ర్‌'

వ‌న్డే ప్రపంచ కప్-2023 కు అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు భారత్ ఆతిథ్యం ఇవ్వ‌నుంది.

Update: 2023-08-25 07:48 GMT

వ‌న్డే ప్రపంచ కప్-2023 కు అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు భారత్ ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ప్రతిష్టాత్మక టోర్నీకి ముందు భారత జట్టు ఆసియా కప్‌లో, ఆ తర్వాత ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే సిరీస్‌లో పాల్గొంటుంది. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవలే ఆసియా కప్ తరహాలోనే ప్రపంచకప్‌కు జట్టును ఎంపిక చేస్తామని అంగీకరించారు. భారత జట్టుకు ఆసియా కప్ చాలా ముఖ్యమైనది. ఈ టోర్నీ ద్వారా చాలా మంది గాయపడిన ఆటగాళ్లు తిరిగి జట్టులోకి వస్తున్నారు.

అయితే.. స్టార్ స్పోర్ట్స్‌తో టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్‌ సంజయ్ బంగర్ సంభాషణలో.. ప్రపంచ కప్-2023 కోసం తన 15 మంది అభిమాన ఆటగాళ్లను ఎంపిక చేశారు. ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్, ఇద్దరు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్, ఇద్దరు స్పిన్ ఆల్ రౌండర్లు, ఒక ఫాస్ట్ బౌలర్ ఆల్ రౌండర్, ఒక స్పిన్నర్, నలుగురు ఫాస్ట్ బౌలర్లను తన జట్టులో చేర్చుకున్నట్లు బంగర్ చెప్పాడు.

బంగర్ మాట్లాడుతూ.. “నా జట్టులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్నారు. ఇద్దరు వికెట్ కీపర్లలో ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ కొనసాగనున్నారు. స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్లుగా అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, ఫాస్ట్ బౌలర్ ఆల్ రౌండర్‌గా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసిన‌ట్లు ప్ర‌క‌టించాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్.. నలుగురు ఫాస్ట్ బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ ల‌ను ఎంపిక చేసిన‌ట్లు తెలిపాడు.

సంజయ్ బంగర్ జ‌ట్టు

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.

అయితే అర్ష్‌దీప్ సింగ్ ను ఎంపిక చేయ‌డం ద్వారా బంగ‌ర్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. 24 ఏళ్ల లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్.. ఇప్పటి వరకు మూడు వన్డేలు ఆడాడు. అందులో ఒక్క వికెట్ కూడా తీయలేదు. అయితే టీ20 అంతర్జాతీయ ఫార్మాట్‌లో అర్ష్‌దీప్ సింగ్ గణాంకాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అర్ష్‌దీప్ సింగ్ 33 టీ20 ఇంటర్నేషనల్స్‌లో 50 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్‌కు ప్రకటించిన జట్టులో అర్ష్‌దీప్ సింగ్ పేరు లేక‌పోవ‌డం విశేషం.


Tags:    

Similar News