Chandrababu : చంద్రబాబు అంటే.. మజాకానా.. స్కెచ్ వేస్తే సొమ్మ సిల్లి పడిపోవాల్సిందే

తెలుగుదేశం పార్టీ చంద్రబాబునాయుడును రాజకీయంగా ఢీకొట్టడం ఆషామాషీ కాదు.

Update: 2024-03-11 12:42 GMT

తెలుగుదేశం పార్టీ చంద్రబాబునాయుడును రాజకీయంగా ఢీకొట్టడం ఆషామాషీ కాదు. ప్రజాబలం అన్నది పక్కన పెట్టినా పార్టీని విజయం వైపు తీసుకెళ్లేందుకు ఆయన వేేసే ప్రతి అడుగు పార్టీకి అదనపు బలంగా మారతాయి. తెరవెనక వ్యవహారాలను నడపటంలో ఆయనను మించిన వారు సమకాలీన రాజకీయ నేతల్లో ఎవరూ లేరనే చెప్పాలి. లేకపోతే... 2018లో తాను కాదనుకున్న ఎన్డీఏను కాలదన్ని.. తిరిగి ఐదేళ్లు కాకముందే అదే ఎన్డీఏలో భాగస్వామిగా మారడం అంటే మామూలు విషయం కాదు. అందులో బలమైన మోదీ, అమిత్ షా ఉన్న సమయంలో ఆయన వేసిన ఎత్తులు.. అడుగులు హస్తిన నుంచి పిలుపు వచ్చేలా చేశాయంటే అతిశయోక్తి ఎంతమాత్రం లేదు.

పొత్తుల విషయంలో...
పొత్తుల సంగతి అలా ఉంచితే.. అధికారంలోకి రాగానే సరిపోదు. ఆ తర్వాత తన ప్రభుత్వం కొనసాగాలన్నది కూడా చంద్రబాబు దూరాలోచన. అందుకే చంద్రబాబు విజన్ ఉన్న నేతగా అందరూ అంటారు. కేవలం అభివృద్ధి విషయంలో కాదు.. పొలిటికల్ గా కూడా ఆయన ముందు చూపుతూనే నిర్ణయాలు తీసుకుంటారు. పైకి అందరికీ ఇప్పుడు అర్థం కాకపోయినా అత్యవసర సమయంలో చంద్రబాబు ఈ నిర్ణయం అప్పుడు ఎందుకు తీసుకున్నారో అర్థమై ఆ పార్టీ నేతలే ముక్కున వేలేసుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయనే చెప్పాలి. అందుకే చంద్రబాబును ఎవరూ తక్కువగా అంచనా వేయరు. వేయకూడదు కూడా.
మరో ఎత్తుగడ....
పేరు రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు అని చెబుతున్నా.. ఈసారి అధికారంలోకి రాకపోతే ఇక పార్టీ డోర్స్ క్లోజ్ చేసుకోవాల్సిందేనని చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకే ఎవరేమన్నా... ఎన్ని మాటలన్నా.. బలం లేకున్నా... ఎన్నికల సరంజామాను సర్దుబాటు చేసుకోవడానికి బీజేపీ అండ అవసరమని భావించి ఆయన అనుకున్నారు. అంతేకాదు. జనసేన విషయంలోనూ ఆయన సక్సెస్ అయ్యారు. తనకు మద్దతిచ్చిన పవన్ కల్యాణ్ కు 24 స్థానాలు కేటాయించడంతోనే ఆయన తొలి విజయం సాధించినట్లయింది. ఇదంతా ఒక ఎత్తయితే..మరో ఎత్తుగడ కూడా ఉంది. అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న చంద్రబాబు ముందు జాగ్రత్తగానే తనకు అత్యంత నమ్మకమైన నేతలను బీజేపీలోకి పంపగలిగారు. వారే ఇప్పుడు బీజేపీలో అభ్యర్థులయ్యే అవకాశాలున్నాయి.
ఇతర పార్టీ అభ్యర్థులు...
రాజ్యసభ సభ్యులుగా ఉన్న సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి వారు చంద్రబాబుకు అత్యంత నమ్మకమైన వారే. అనకాపల్లి స్థానం నుంచి సీఎం రమేష్, రాజమండ్రి నుంచి సుజనా చౌదరి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఇక ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరుతున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని రాజంపేట నుంచి బరిలోకి దింపే అవకాశముంది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ప్రియశిష్యుడుగా ఉన్న సత్యకుమార్ ను హిందూపురం నుంచి, టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లి కొత్తపల్లి గీతను అరకు పార్లమెంటు నుంచి పోటీ చేయించే ఛాన్స్ ఉంది. వీరితో పాటు శాసనసభ స్థానాల్లోనూ ఇదే ఫార్ములా అనుసరిస్తున్నారు. ధర్మవరం నుంచి వరదాపురం సూరి, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణరెడ్డి కూడా టీడీపీ సానుభూతి పరులే. కేవలం బీజేపీ మాత్రమే కాదు.. జనసేనలో పోటీ చేసే అభ్యర్థులు కూడా తనకు అనుకూలురైన వారు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్న చంద్రబాబు ముందు చూపుకు హ్యాట్సాఫ్ చెప్పక తప్పదు.


Tags:    

Similar News