Pawan Kalyan : పవన్ ఫోకస్ పెట్టనిది అందుకేనట.. దూరాలోచన అదుర్స్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయకపోవడానికి కారణాలున్నాయి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయకపోవడానికి కారణంపై అనేక రకాలుగా ప్రచారం జరుగుతుంది. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టి దశాబ్దం దాటినా పవన్ ఇంకా గ్రౌండ్ లెవెల్ లో బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు సొంత పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. అయితే పవన్ కల్యాణ్ కావాలనే పార్టీని బలోపేతం చేయడం లేదని తెలిసింది. ముందుగా అధికారంలోకి వచ్చి తన కంటూ ఒక ఇమేజ్ పెంచుకున్న తర్వాత మాత్రమే పార్టీని బలోపేతం చేస్తే బాగుంటుందని ఆయన భావించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏమీ లేకుండా పార్టీని బలోపేతం చేస్తే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం పోటీ తీవ్రతరం అవుతుందని ఆయన భావించారు.
మరికొన్ని ఎన్నికల వరకూ...
మరికొన్ని ఎన్నికల వరకూ ఆయన ఇదే స్ట్రాటజీని అవలంబించనున్నారు. గత ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు నియోజకవర్గాలను మాత్రమే పవన్ కల్యాణ్ పొత్తులో భాగంగా తీసుకున్నారు. హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేట్ తో విజయం సాధించింది. ఈ నియోజకవర్గాల్లో కూడా సరైన అభ్యర్థుల కోసం వెదుకులాట చేయాల్సి వచ్చింది. కొన్ని నియోజకవర్గాల్లో ఇతర పార్టీలకు చెందిన నేతలకు టిక్కెట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కీలకమైన నేతలకు టిక్కెట్లు ఇచ్చామన్న సంతృప్తి పవన్ కల్యాణ్ లో కనపడుతుంది. అయితే ఎక్కువ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసి టిక్కెట్లు ఇవ్వలేకపోతే వారిలో అసంతృప్తి పెరుగుతుందని భావించి ఆయన పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవడం లేదన్న వాదన అయితే వినిపిస్తుంది.
ఎక్కువ సీట్లు తీసుకున్నా...
2029 ఎన్నికల్లోనూ మొన్నటి ఎన్నికల్లో కంటే కొన్ని అదనపు సీట్లు కోరనున్నారు. అంతే తప్పించి శక్తికి మించిన సీట్లు తీసుకుని అందులో ఓటమి పాలయితే తనతో పాటు పార్టీకి ఉన్న ఇమేజ్ కూడా డ్యామేజీ అవుతుందని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. అందుకే పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటనలు కూడా పెద్దగా చేయడం లేదు. తనకు బలం ఉన్న చోట మాత్రమే ఆయన ఎక్కువగా పర్యటిస్తున్నారు. పవన్ పదే పదే పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండాలని కోరుతున్నది కూడా అందుకేనంటున్నారు. ఒక్కసారి ముఖ్యమంత్రి పదవి కోసం ఆశపడి అధిక నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఓటమిపాలయి నవ్వుల పాలవుతామని, అందుకే స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ అన్న రీతిలో పవన్ కల్యాణ్ పార్టీని నడిపే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. పవన్ ఆలోచన.. వ్యూహం తెలియని వారు మాత్రం పవన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా పెద్దగా లెక్క చేయడం లేదు.