Ys Jagan : వారిని పక్కన పెట్టి.. వీరిని పక్కనుంచుకోవాల్సిందే.. లేకుంటే ఇక అంతే
వైసీపీ అధినేత జగన్ కొందరిని పక్కన పెట్టాలి. మరికొందరిని పక్కన పెట్టుకోవాలి
వైసీపీ అధినేత జగన్ కొందరిని పక్కన పెట్టాలి. మరికొందరిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పటికే జగన్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పటికే కొన్ని సామాజికవర్గాలు పార్టీకి దూరమయ్యాయి. ప్రధానంగా కాపు, కమ్మ, బ్రాహ్మణ, వైశ్య సామాజికవర్గాలు గత పరిపాలనలో తీసుకున్న నిర్ణయాల కారణంగా దూరమయ్యాయి. అయితే అధికారం కోల్పోయిన తర్వాత అయినా వారిని దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం చేయడం లేదనే అనిపిస్తుంది. జగన్ తన చుట్టూ ఒకే సామాజికవర్గం నేతలను పక్కన పెట్టుకుని రాజకీయాలు చేస్తుండటం సహజంగా మిగిలిన సామాజికవర్గాలకు మండుతుంది. వారు వైసీపీకి అనుకూలంగా మారాలనుకున్నప్పటికీ ఈ తంతు చూసి వారు ఫ్యాన్ పార్టీ వైపు చూసేందుకు కూడా ఇష్టపడటం లేదు.
కాపు సామాజికవర్గానికి...
ఆంధ్రప్రదేశ్ లో బలమైన ఓటు బ్యాంకు ఉన్న కాపు సామాజికవర్గానికి జగన్ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆ సామాజికవర్గం జనసేన వైపు వెళ్లింది. దాని నుంచి వైసీపీ వైపు రావడం చాలా వరకూ కష్టమే. అయితే దీనిని అధిగమించాలంటే కాపు సామాజికవర్గం నేతలకు కీలకమైన బాధ్యతలను అటు జిల్లాల్లోనూ, ఇటు పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ, పార్టీ కమిటీల్లోనూ కీలక స్థానం కల్పించాలి. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వల్ల ఏ మాత్రం ఉపయోగం ఉండదని, వారిని పట్టుకుని రాజకీయం చేస్తే ఒక్క ఓటు కూడా ఇతర సామాజికవర్గం నుంచి వచ్చే అవకాశాలు లేవన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అలాగే జిల్లాల సమన్వయ కర్తలుగా రెడ్డి సామాజికవర్గాన్ని పక్కన పెట్టి మిగిలిన వారికి అందలం ఎక్కించాలి.
సీనియర్ నేతలను కూడా...
ఇక దీంతో పాటు సీనియర్ నేతలను కూడా తన పక్కన ఉంచుకోవాల్సి ఉంటుంది. వైసీపీలో చాలా మంది సీనియర్లున్నారు. ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, బొత్స సత్యనారాయణతో పాటు అనేక మంది నేతలు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ ఉన్నారు. రాయలసీమలోనూ ఇతర సామాజికవర్గాల నేతలు సీనియర్లుగా ఉన్నారు. వారితో సలహా మండలిని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వారిని గుర్తించి వారికి పార్టీలో సముచితమైన స్థానం కల్పించాల్సి ఉంటుంది. జగన్ కోసం పనిచేసే వారు అనేక మంది ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ ఫార్ములాతోనే సక్సెస్ అయ్యారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తండ్రి ఫార్ములాను పక్కన పెట్టడం వల్లనే సరైన నిర్ణయాలు, సలహాలు అందలేదన్న విమర్శలు ఇప్పటికీ పార్టీలో అనేక మంది చెబుతున్నారు. ఇప్పటికైనా జగన్ పార్టీకి మరింత డ్యామేజీ జరగకుండా సామాజికవర్గాలకు, సీనియర్లకు మంచి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు.