Ys Jagan : ఒకవైపే చూస్తా.. ఇంకొక వైపు చూడను.. ఇదీ జగన్ సిగ్నల్స్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈసారి కూటమిగా ప్రత్యర్థులు కలసి వచ్చినా గెలుపు కోసం స్ట్రాటజీని వర్కవుట్ చేస్తున్నారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈసారి కూటమిగా ప్రత్యర్థులు కలసి వచ్చినా గెలుపు కోసం స్ట్రాటజీని వర్కవుట్ చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే హస్తినలో మంతనాలు మొదలుపెట్టినట్లు తెలిసింది. కొందరు కీలక నేతలతో జగన్ నేరుగా సమావేశం కాకపోయినప్పటికీ తన ఆలోచనలు మాత్రం వారికి పంపినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలసి పోటీ చేస్తే గెలుపు కష్టమేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ముగ్గురు కలసి పోటీ చేసినప్పటికీ తన గెలుపునకు ఢోకా లేకుండా ముందుగానే స్ట్రాటజీని ప్రిపేర్ చేసుకుని వెళుతున్నారట వైసీపీ అధినేత. అందులో భాగంగా తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నమ్మకమైన మిత్రుడిగా ఉన్నానంటూ సంకేతాలను ఇప్పటికే కొందరి ద్వారా చేరవేశారని సమాచారం.
నేరుగా పొత్తు పెట్టుకోకపోయినా...
వైఎస్ జగన్ బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకోరు. ఆయన ఒంటరిగానే పోటీ చేస్తారు. కానీ ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా 2012 నుంచి జగన్ కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ వైపు చూడలేదు. కాంగ్రెస్ ను ప్రధాన శత్రువుగా మాత్రమే చూస్తూ వచ్చారు. 2014లో అధికారంలోకి రాకపోయినా, 2019 లో అధికారంలోకి వచ్చినా, 2024లో ఓటమి పాలయినప్పటికీ తన బలగాన్ని మాత్రం బీజేపీ వైపు మాత్రమే మళ్లించారు. అంతే తప్ప మరొక వైపు చూడలేదు. అందుకే నా చూపు ఒకవైపు అన్నట్లు ఆయన వ్యవహార శైలి ఉంది. కానీ చంద్రబాబు మాత్రం 2018 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
పరోక్ష సహకారం అందించాలని...
అందుకే తనకు ఎన్నికలలో పరోక్ష సహకారం అందించాలని జగన్ బలంగా కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఇప్పటి వరకూ జగన్ కమలంతో ఎట్టిపరిస్థితుల్లో కయ్యానికి దిగడం లేదు. జగన్ నోటి నుంచి బీజేపీపై విమర్శలు చేయకపోవడం కూడా అదే కారణమని అంటున్నారు. మరొకవైపు తాను అధికారంలోకి వస్తే బీజేపీకి అనుకూలురైన పారిశ్రామికవేత్తలకు కూడా రాజ్యసభ పదవులు ఇచ్చిన విషయాన్ని జగన్ గుర్తు చేశారని టాక్. ఏపీలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తాను నేరుగా పొత్తు పెట్టుకోవడం లేదని, అయినా సరే ఎన్డీఏకు బయట నుంచి తాను మద్దతిస్తానని ఇప్పటికే ఢిల్లీకి సమాచారం చేరవేసినట్లు చెబుతున్నారు. మొత్తం మీద జగన్ ఈసారి కేవలం పాదయాత్ర మాత్రమే కాదు.. హస్తిన సహకారంతో కూడా అందలం ఎక్కాలన్న యోచనలో ఉన్నారు.