అసలు పని పూర్తి కాక?

ఢిల్లీకి లోకేష్ ఎందుకు వెళ్లారు? ఏం చేస్తున్నారు? అక్కడ అనుకున్న పని జరగడం లేదా? ఇదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చర్చ

Update: 2023-09-19 12:41 GMT

ఢిల్లీకి లోకేష్ ఎందుకు వెళ్లారు? ఏం చేస్తున్నారు? అక్కడ తాము అనుకున్న పని జరగడం లేదా? ఇదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చర్చ. తన తండ్రి చంద్రబాబు అరెస్ట్‌తో యువగళం పాదయాత్రను కూడా తాత్కాలికంగా వాయిదా వేసిన లోకేష్ కేవలం రెండు రోజులు మాత్రమే రాజమండ్రిలో ఉన్నారు. పవన్ కల్యాణ్, బాలకృష్ణతో కలసి ఆయన చంద్రబాబుతో ములాఖత్ అయిన తర్వాత రాజమండ్రి నుంచి హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. దాదాపు ఐదు రోజుల నుంచి లోకేష్ ఢిల్లీలోనే మకాం వేశారు. జాతీయ మీడియాతో మాట్లాడేందుకే లోకేష్ ఢిల్లీ వెళ్లారని కొంత ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఒక జాతీయ ఇంగ్లీష్ ఛానల్ లో ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

న్యాయనిపుణులతో...
అంతవరకూ ఓకే. కానీ లోకేష్ ఢిల్లీలోనే ఉన్నారు. న్యాయనిపుణులను సంప్రదించేందుకు ఢిల్లీకి వెళ్లారని కూడా అన్నారు. చంద్రబాబుకు రిమాండ్ విధించడంతో వీలయినంత త్వరగా ఆయనను బెయిల్‌పై బయటకు రప్పించాలని లోకేష్ న్యాయనిపుణులతో కూడా సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. ఆ మేరకే ఈరోజు చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై వాదించడానికి ఢిల్లీ నుంచి సిద్ధార్థ లూథ్రాతో పాటు సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే వాదనలు జరిపారు. దీనిపై తీర్పు రిజర్వ్ అయింది. మరో వైపు ఏసీబీ కోర్టులో ఫైబర్ నెట్ స్కాంపై కూడా పీీటీ వారెంట్ దాఖలు చేశారు. దీనిని కూడా ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. అంత వరకూ బాగానే ఉంది కాని చినబాబు వెళ్లిన అసలు పని మాత్రం కాలేదన్నది పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం. అది పూర్తయిన తర్వాత ఢిల్లీ నుంచి ఆయన రాజమండ్రికి రావాలని భావిస్తున్నారట.
కేంద్రంలోని పెద్దలను...
కేంద్రంలోని పెద్దలను కలవాలనే లోకేష్ ప్రధానంగా హస్తిన పర్యటనను పెట్టుకున్నారంటున్నారు. నిన్నటి నుంచి పార్లమెంటు సమావేశాలు కూడా ప్రారంభం కావడంతో కేంద్రంలోని బీజేపీ పెద్దలను కలసి చంద్రబాబు అరెస్ట్ అక్రమమని చెబుతూ వారికి కేసు గురించి వివరించాలన్నది చినబాబు ప్రయత్నం. చంద్రబాబు సూచన మేరకే లోకేష్ ఢిల్లీకి వెళ్లినట్లు కూడా చెబుతున్నారు. మాజీ కేంద్ర మంత్రి ఒకరు బీజేపీ పెద్దలతో లోకేష్ భేటీకి అనేక ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటి వరకూ ఫలించలేదని తెలిసింది. నిన్నంతా మంత్రివర్గ సమావేశంలో రాత్రి వరకూ ఉండటంతో వారిని కలవటం కుదరలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈరోజు ఉదయం కూడా ఢిల్లీలో ఆయన మహాత్మాగాంధీ ఘాట్ వద్ద నివాళులర్పించారు కూడా.
ఈరోజు, రేపు...
ఈరోజు లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా పడటంతో కేంద్రం పెద్దలు కొంత ఫ్రీ అయ్యారంటున్నారు. ఈ రాత్రికి లోకేష్ వారిని కలిసి తన తండ్రి చంద్రబాబు అరెస్ట్ వెనక జరిగిన రాజకీయ కుట్రను వివరించనున్నారని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకూ ఢిల్లీ పెద్దల అపాయింట్‌మెంట్ మాత్రం ఇంకా ఖరారు కాలేదని తెలిసింది. టీడీపీ పార్లమెంటు సభ్యులు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించకపోవడంతో చినబాబు కొంత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈరోజు, రేపు ఢిల్లీలోనే ఉండి వారి అపాయింట‌్‌మెంట్ కోసం చూసి వీలుకాకుంటే ఎల్లుండి ఆయన రాజమండ్రి బయలుదేరి వచ్చే అవకాశాలున్నాయన్నది కూడా పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. మొత్తం మీద ఢిల్లీలో చిన బాబు వెళ్లిన అసలు పని మాత్రం ఇంకా పూర్తి కాలేదన్నది ఇప్పటి వరకూ అందుతున్న సమాచారం.


Tags:    

Similar News