Tdp, Janasena : ఇద్దరం కలిసే వెళదాం... ఎవరేమనుకున్నా సరే.. గెలుపే ప్రధానంగా

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ ఆసక్తకిరంగా మారింది

Update: 2024-01-14 02:38 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ల సమావేశంలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ నిన్న రాత్రి ఏడు గంటలకు చంద్రబాబు ఇంటికి వచ్చి అక్కడే ఉన్నారు. దాదాపు మూడు గంటలకు పైగానే ఇద్దరూ రాజకీయ అంశాలపై చర్చించుకున్నారు. ఇటు భోజనం చేస్తూ కూడా భవిష్యత్ రాజకీయాలపై చర్చించినట్లు తెలిసింది. సీట్ల పంపకంతో పాటు ఉమ్మడి మ్యానిఫేస్టో, ఉమ్మడి ప్రచారంపై కూడా ఇద్దరూ ఒక అవగాహనకు వచ్చారని తెలిసింది. వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి బహిరంగ సభలను నిర్వహించి క్యాడర్ లను ఏకం చేయాలని నిర్ణయించారని తెలిసింది.

ఉమ్మడి మ్యానిఫేస్టో...
ఉమ్మడి మ్యానిఫేస్టో రూపకల్పనకు సంబంధించి ఇప్పటికే కమిటీలు వేసుకున్న పార్టీలు ఆ యా కమిటీలు అందించిన నివేదిక ప్రకారం ఉమ్మడి మ్యానిఫేస్టో ను రూపొందించాలని నిర్ణయించారు. రెండు పార్టీలూ కలసి ఉన్నామని ప్రతి అడుగులో కనిపించేలా వ్యవహరింాచాలని ఇరు పార్టీల అగ్రనేతలు నిర్ణయించారు. ఓట్ల బదలాయింపు జరగాలంటే ఒకరి సమావేశంలో మరొకరు పొత్తులో ఉన్న పార్టీ క్యాడర్ లో జోష్ నింపేలా ప్రసంగాలు సాగడం మంచిదన్న అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమయనట్లు తెలిసింది. ముఖ్యమంత్రి పదవి విషయంలోనూ ఎలాంటి వ్యాఖ్యలు రెండు పార్టీల పరంగా చేయకపోవడమే మంచిదని నేతలిద్దరూ ఒక అంగీకారానికి వచ్చారు.
సీఎం పదవిపై...
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కూర్చుని ముఖ్యమంత్రి పదవిలో ఎవరు ఉండాలన్నది నిర్ణయిస్తారన్న దానినే ఎక్కువగా హైలెట్ చేయాలని అనుకున్నారు. అంతే తప్ప మరొకరు ఎవరూ ముఖ్యమంత్రి పదవిపై మాట్లాడకుండా, నోరు జారకుండా పార్టీ కింది స్థాయి నేతలకు ఆదేశాలు జారీ చేయాలన్న నిర్ణయానికి కూడా వచ్చారు. ఇక సీట్ల పంపిణీపై కూడా ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. జనసేనకు బలమున్న ప్రాంతాల్లో ఖచ్చితంగా ఆ సీటును జనసేనకే ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని తెలిసింది. అయితే జిల్లాల్లో అన్నీ కాకుండా ప్రతి జిల్లాల్లో రెండు పార్టీలకు భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని కూడా భావించినట్లు తెలిసింది.
అంకెలు ముఖ్యం కాదంటూ...
మరోవైపు జనసేన అధినేత పవవన్ కల్యాణ్ తన పార్టీకి నలభై స్థానాలను కేటాయించాలన్న ప్రచారం పై కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. అయితే అంకెలు ముఖ్యం కాదని, గెలుపు ప్రధానమని చంద్రబాబు అభిప్రాయపడినట్లు సమాచారం. అందుకు పవన్ కల్యాణ్ కూడా అంగీకరించారని చెబుతున్నారు. బీజేపీని కలుపుకుని పోవడమే బెటర్ అన్న అభిప్రాయానికి ఇరు పార్టీల నేతలు వచ్చారు. బీజేపీ నిర్ణయం కోసం మరికొంత కాలం వెయిట్ చేద్దామని కూడా పవన్, చంద్రబాబులు ఈ సమావేశంలో నిర్ణయించారు. మరొక సారి ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలతో చర్చించిరావాలని పవన్ ను చంద్రబాబు కోరినట్లు తెలిసింది. మొత్తం మీద ఇరు పార్టీల నేతల భేటీ సాఫీగా... ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా సాగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.


Tags:    

Similar News