చంద్రుడిపై భూమిని కొనలేము

ఇంతకూ చంద్రుడిపై మనం భూమిని కొన్నంత మాత్రాన అది మన సొంతం అవుతుందా

Update: 2023-08-26 11:19 GMT

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి సుద్దాల రాంచందర్‌- వకుళాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు సుద్దాల సాయి విజ్ఞత అమెరికాలో స్థిరపడ్డారు. అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలోగవర్నర్‌ కిమ్‌ రెనాల్స్‌ వద్ద ప్రాజెక్టు మేనేజర్‌, ఫైనాన్షియల్‌ అడ్వయిజర్‌గా పని చేస్తున్నారు. చంద్రుడిపై భూమి కొనుగోలు చేయవచ్చని తెలుసుకున్న సాయి విజ్ఞత తాను తన తల్లికి బహుమతిగా చంద్రుడిపై స్థలాన్ని కొనివ్వాలని నిర్ణయించుకుంది. చంద్రుడిపై భూమి కొనుగోలుకు లూనార్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. తన తల్లి వకుళ, మనుమరాలు ఆర్త సుద్దాల పేరున రిజిస్ట్రేషన్ చేయించారు.

పలువురు ప్రముఖులు కూడా చంద్రుడిపై భూమిని కొన్నట్లు చెప్పారు. దీంతో చాలా మంది కాస్త వెరైటీగా చేద్దామని చంద్రుడిపై భూమిని కొన్నారు. ఇంతకూ చంద్రుడిపై మనం భూమిని కొన్నంత మాత్రాన అది మన సొంతం అవుతుందా..? అంటే అందుకు సమాధానం 'లేదు' అనే వస్తుంది. చంద్రుడిపై భూమిని తమ సొంతం అని చెప్పుకునే హక్కు ఎవరికీ లేదు.

చంద్రుడిపై భూమిని మీరు కొనుగోలు చేసినప్పటికీ, దాని యాజమాన్య హక్కులు పొందలేరు. అది మీ పేరుపై మాత్రమే రిజిస్టరై ఉంటుంది. అంతేగానీ, దానిని క్లెయిమ్ చేసుకోలేరు. 1967లో 104 దేశాలు ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నాయి. చంద్రుడు, నక్షత్రాల వంటి వాటిపై ఏ ఒక్క దేశానికి యాజమాన్య హక్కులు ఉండబోవని ఈ ఒప్పందం సారాంశం. ఈ అగ్రిమెంట్‌పై భారత్ కూడా సంతకం చేసింది. 1967లో సోవియట్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్ కొలోనియల్ కాంపిటీషన్ ను నిరోధించడానికి ఔటర్ స్పేస్ ట్రీటీ అని పిలిచే అంతర్జాతీయ ఒప్పందంతో ముందుకు వచ్చాయి. భూమి దాటి ఉన్న ఏ ప్రాంతంపైనైనా ఒక వ్యక్తికి గాని, ఒక దేశానికి గాని యాజమాన్య హక్కులు ఉండబోవని ఈ ఒప్పందం సారాంశం.
చంద్రుడిపై భూమిని కొనుగోలు చేయడంపై ఓ వెబ్సైటు ఉంది. ఆసక్తి ఉన్న వారు https://lunarregistry.com వెబ్‌సైట్‌లో కొనుగోలు ప్రక్రియను ప్రారంభించవచ్చు. చంద్రుడిపై కూడా వివిధ ప్రాంతాలకు వేర్వేరు పేర్లు ఉన్నాయి. బే ఆఫ్ రెయిన్‌బో, లేక్ ఆఫ్ డ్రీమ్, సీ ఆఫ్ వేపర్స్ వంటి ప్రాంతాలు చంద్రుడిపై ఉన్నాయి. అక్కడి భూమిని ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేయవచ్చు. వెబ్‌సైట్ నుంచి భూమిని కొనుగోలు చేసిన అనంతరం మీకు పూర్తి డాక్యుమెంట్లు వస్తాయి.


Tags:    

Similar News