Telangana, Ap : తెలంగాణ ఎన్నికల రిజల్ట్ ఏపీ పై ప్రభావం చూపుతుందా? ఏపీలో ఎందుకంత హడావిడి?

తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ పై ప్రభావం చూపనున్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

Update: 2023-11-29 04:27 GMT

తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ పై ప్రభావం చూపనున్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తెలంగాణలో ఏ పార్టీ గెలిస్తే ఏపీలో ఎవరికి లాభం? అక్కడ ఎవరు అధికారంలోకి వస్తే ఏపీలో ఏ పార్టీకి సానుకూలత వస్తుందన్నది ప్రతి చోటా చర్చ జరుగుతూనే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉండి విడిపోయి పదేళ్లు కావస్తున్నా రెండు రాష్ట్రాల మధ్య గెలుపోటములను అంచనా వేయడం రెండు రాష్ట్రాల్లో అలవాటు. అందరూ తెలుగు వాళ్లే కాబట్టి సహజమే. అయితే ముందుగా తెలంగాణలో ఎన్నికలు జరుగుతుండటంతో అక్కడ ఎవరు గెలుస్తారన్న దానిపై ఏపీలో కూడా పెద్దయెత్తున బెట్టింగ్ లు జరుగుతున్నాయంటే ఎంతగా నిశితంగా గమనిస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

రాజకీయంగా...
అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు వేరు. రాజకీయంగా.. సామాజికంగా భిన్నమైన పరిస్థితులు. తెలంగాణలో లేనిది ఏపీలో ఉన్నది కులం. ఏపీలో కుల ప్రభావం ఎక్కువ. తెలంగాణలో అది తక్కువగా కనిపిస్తుంది. 2014 లో అక్కడ బీఆర్ఎస్ విజయం సాధిస్తే అదే సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2018లో బీఆర్ఎస్ రెండోసారి గెలిస్తే ఏపీలో మాత్రం వైసీపీ అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. అంటే... రెండుసార్లు తెలంగాణలో ఒకే పార్టీ గెలిచినా... ఏపీలో మాత్రం రెండుసార్లు వేర్వేరు పార్టీలు అధికారంలోకి రావడం అందరికీ తెలిసిందే. అందుకే రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ ప్రభావం తక్కువగానే ఉంటుందంటున్నారు.
రిజల్ట్ కూడా...
తెలంగాణలో సీమాంధ్ర ఓటర్లు ఎక్కువ. అక్కడ వారు ప్రభావం చూపుతారు. కానీ ఏపీలో అలా కాదు. ఇక్కడ వేర్వేరు కారణాలు విజయాలకు దోహదం చేస్తాయి. తెలంగాణలో రెండుసార్లు కేసీఆర్ అధికారంలోకి రాగా, ఏపీలో మాత్రం మార్పు కోరుకున్నారన్నది గత ఎన్నికల ఫలితాలను బట్టి తెలుస్తోంది. అంటే ఏపీ రాజకీయం వేరు. తెలంగాణ పాలిటిక్స్ ను వేర్వేరుగానే చూడాలి. ఇక సంక్షేమ పథకాలు కొనసాగించినా ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోతే ఇక్కడ ఓడిస్తారని చెప్పలేం. అలాగని అధికార పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తారని అనుకోలేం. ఎందుకంటే వేర్వేరు మనస్తత్వాలు. ఇద్దరు ముఖ్యమంత్రులు సంక్షేమంపైనే ఎక్కువ దృష్టి పెట్టడంతో ఈ అంశంపైనే ఎక్కువగా చర్చ జరుగుతుంది.
విభిన్న పరిస్థితులు...
ఇక కేసీఆర్ అక్కడ ఒంటరిగానే బరిలోకి దిగారు. ఇక్కడ కుల ప్రభావం అధికంగా ఉండటంతో చంద్రబాబు బలమైన సామాజికవర్గం అండగా ఉంటందనుకున్న పవన్ కల్యాణ్ తో చేతులు కలిపారు. జగన్ మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంటే... ఏపీలో మాత్రం బలహీనంగా ఉంది. తెలంగాణలో బీజేపీ ఒకింత స్ట్రాంగ్ గా కనిపిస్తుంటే, ఏపీలో అస్సలు జాడే లేదు. కమ్యునిస్టుల ప్రభావం కూడా అంతే. అంటే రెండు రాష్ట్రాల్లో మాట్లాడేది ఒకే భాష అయినా... ఎన్నికలకు వచ్చే సరికి అనేక ఈక్వేషన్లు పనిచేస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే తెలంగాణ ఎన్నికల ఫలితాలకు, ఏపీలో జరగబోయే ఎన్నికలకు మధ్య పొంతన ఉండదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. కాకుంటే తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలని టీడీపీ అభిమానులు కోరుకుంటుంటే... జగన్ సైన్యం మాత్రం మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావాలనుకుంటుంది. ఇది కేవలం సరిపోల్చుకోవడానికే తప్ప గెలుపోటములను నిర్దేశించడానికి మాత్రం కాదన్నది విశ్లేషకుల అంచనా.


Tags:    

Similar News