ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నారా లోకేశ్ ఒకరకంగా భావి నేతగా అవతరిస్తున్నారు. నారా లోకేశ్ విభిన్నశైలిని చూసిన వారికి ఎవరికైనా త్వరలోనే ఆయన కీలక పదవి అధిష్టించే అవకాశముందని అంచనా వేస్తారు. ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు సమస్యలను ఎత్తి చూపేవారిని శత్రువులుగా చూస్తారు. వైసీపీ హాయంలో సమస్యలు చెప్పిన వాళ్లపై టీడీపీ ముద్ర వేసి వేధించారు. కానీ ఇక్కడ నారా లోకేశ్ మార్పు చూపిస్తున్నారు. సమస్యలను ప్రస్తావించడాన్ని ఓ సానుకూల విషయంగా చూసి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కోణంలో మన్యంలో సమస్యలపై జాతీయ మీడియా కథనాలు వచ్చినా.. గుంటూరులో డ్రైనేజీ సమస్య గురించి ఓ మహిళ చెప్పినా… ఉద్దేశపూర్వకంగా చేశారని తెలిసినా.. మధ్యాహ్నభోజనం అంశంపై ఓ వీడియోలో విద్యార్థుల ఆగ్రహం గురించి తెలిసినా..ఆయన చాలా పాజిటివ్ గా స్పందించారు. సమస్యల పరిష్కారం కోసం అప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు.
వైఫల్యాలను ఎత్తి చూపినా...
సాధారణంగా అధికారంలో ఉన్నవారు తమ వైఫల్యాలను ఎత్తిచూపే వారిని రాజకీయ శత్రువులుగా చూస్తుంటారు. కానీ, ఇప్పుడు నారా లోకేశ్ దానికి విభిన్నంగా వ్యవహరిస్తున్నారు.. తన వద్దకు వచ్చే విమర్శలను, సోషల్ మీడియాలో వచ్చే ఫిర్యాదులను ఆయన ఒక ఫీడ్‌బ్యాక్ గా స్వీకరిస్తున్నారు. సమస్య ఎక్కడ ఉన్నా, అది ఎవరు చెప్పినా.. దాని వెనుక రాజకీయం ఉందా లేదా అని చూడకుండా పరిష్కారం వైపే అడుగులు వేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా దేవునిచెరువు పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత సరిగ్గా లేదని విద్యార్థులు ఆహారాన్ని చెత్తబుట్టలో పోస్తున్న వీడియో వైరల్ అయ్యింది. దీనిపై లోకేష్ స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ఇలాంటి ఘటనలు జరిగితే సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ లోకేష్ మాత్రం నిస్సంకోచంగా క్షమాపణలు చెప్పారు. బిడ్డలకు నాణ్యమైన ఆహారం అందకపోవడం నా బాధ్యతారాహిత్యం అని పేర్కొంటూ వెంటనే సంబంధిత ఏజెన్సీని తొలగించి, హెడ్ మాస్టర్‌ను సస్పెండ్ చేయించారు. ఒక మంత్రి స్థాయి వ్యక్తి బహిరంగంగా క్షమాపణలు చెప్పడం రాజకీయాల్లో అత్యంత అరుదైన విషయమని కూడా అంటున్నారు.
కూటమి పార్టీల మధ్య...
నారా లోకేశ్ విషయంలో కూటమి పార్టీల మధ్య కూడా భిన్నాభిప్రాయాలు ఏమీ లేనట్లే కనిపిస్తుంది. నారా లోకేశ్ పర్యవేక్షణలోనే పరిపాలన నడుస్తుందని మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలకు తెలుసు. కానీ వారు మాత్రం దానిని పాజిటివ్ గానే తీసుకుంటున్నారు. ఎటూ జరిగేది అదేనని, అత్యధిక స్థానాలతో అధికారంలో ఉన్న టీడీపీలో నాయకత్వ బాధ్యతను ఎవరికి అప్పగించాలన్నది ఆ పార్టీ నేతల ఇష్టమన్న అభిప్రాయానికి వచ్చేసినట్లు కనిపిస్తుంది. లోకేష్ అనుసరిస్తున్న ఈ సరికొత్త పంథాను జనసేన నాయకుడు, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు కూడా మనస్ఫూర్తిగా ప్రశంసించారు. విమర్శలను స్వీకరించి, వాటిని పరిష్కరించే విషయంలో నారా లోకేశ్ చూపిస్తున్న పరిణతి రాజకీయాల్లో గొప్ప మార్పుకు సంకేతమని ఆయన పేర్కొన్నారు. మొత్తం మీద నారా లోకేశ్ అందరి అనుమతితోనే త్వరలోనే కీలక పదవి చేపట్టే అవకాశాలను ఎవరూ కొట్టిపారేయలేకపోతున్నారు.