Andhra Pradesh : పిలిచి అందలం ఎక్కిస్తే ..అడ్డంగా బుక్కయ్యారే
తెలుగుదేశం పార్టీకి ఏదో ఒక తలనొప్పి ఏదో ఒక రూపంలో వచ్చిపడుతుంది
తెలుగుదేశం పార్టీకి ఏదో ఒక తలనొప్పి ఏదో ఒక రూపంలో వచ్చిపడుతుంది. అసలు గత ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికే కరెక్ట్ కాదన్నది సీనియర్ నేతల అభిప్రాయం. కేవలం సామాజిక కోణంలోనూ, మరొక రూపంలోనూ టిక్కెట్లు ఇచ్చుకుంటూ పోతే పార్టీ పరువు నడిబజార్లో నిలబెట్టడానికి కూడా ఎవరూ వెనకాడరు. వారికి రాజకీయం ఒక క్రీడ లాంటిది. అంతే.. తమ కుటుంబాన్ని, వారసత్వాన్ని కూడా మర్చిపోతారు. ఇటీవల మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కుమారుడి పేరు కూడా ఈ కేసులో బయటకు రావడం, తాజాగా ఏలూరు పార్లమెంటు సభ్యుడు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పేరు వినిపించడం కూటమికి కోలుకోలేని దెబ్బ.
ప్రజాప్రతినిధిగా ఉంటూ...
ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ డ్రగ్స్ కు అలవాటు పడితే ఇక నియోజకవర్గ ప్రజలకు ఏం నీతులు చెబుతారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ది రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. ఏలూరు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు.యువకుడు. ఎంతో వయసు ఉంది. అలాగే మరెన్నో పదవులు ఆయన దక్కించుకోవాల్సి ఉంది. ఆయన తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ ప్రస్తుతం టీడీపీ మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్ కుమార్ యాదవ్. ఇన్ని ట్యాగ్ లైన్ లు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ వెనక ఉన్నాయి. ఎంత జాగ్రత్తగా ఉండాలి. తండ్రి, మామ రాజకీయ వారసత్వాన్ని ఎక్కువ కాలం కొనసాగించాల్సిన సమయంలో పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఈ బలహీనతకు అలవాటు పడి రాజకీయ జీవితాన్ని తనకు తానే ఇబ్బంది కొని తెచ్చుకున్నారంటున్నారు.
లెగసీని తీసుకెళ్లాల్సిన నేత...
ఇప్పటికే పుట్టా మహేష్ కుమార్ యాదవ్ మొయినా బాద్ డ్రగ్స్ కేసులో పేరు వినపడటంతో వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని మాజీ మంత్రి కాకాణి గోవర్థర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందేనంటూ కాకాణి డిమాండ్ చేశారు. తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ పేరుతో పాటు మామ యనమల రామకృష్ణుడి పేరు కూడా పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తన బలహీననతతో బయటకు తెచ్చినట్లయింది. ఇప్పుడు టీడీపీ సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంది. అయితే దీనికి పార్టీ అధినేత చంద్రబాబు మరెవరో ఏం చేస్తారు? పిలిచి పదవి ఇచ్చి.. అందలం ఎక్కిస్తే పుట్టా మహేష్ ఇలా అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు అందరి నోట్లో నానుతుండటం పార్టీతో పాటు కూటమికి కూడా ఇబ్బందికరంగా మారింది. మోయినాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో దొరికి రాజకీయ ఇబ్బందులను కొని తెచ్చుకున్నారు.