TDP : 41 ఇయర్స్ ఇండ్రస్ట్రీకి ఎంత కష్టం? తొలిసారి చంద్రబాబుకు ఎదురయిందే?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు తొలిసారి పెద్ద కష్టమే వచ్చి పడింది

Update: 2024-02-12 03:54 GMT

Chandrababu Political life:తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు తొలిసారి పెద్ద కష్టమే వచ్చి పడింది. ఎప్పుడూ లేని విధంగా రాజ్యసభలో ఒక్కరు కూడా ప్రాతినిధ్యం లేకపోవడం తలవంపులు తెచ్చిపెట్టేదిగా ఉండేదే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత తొలిసారి ఇలాంటి అరుదైన అనుభవం ఎదురవుతుంది. అయితే ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగి టీడీపీ గెలవడమనేది అతి తక్కువ శాతం మాత్రమే అవకాశాలున్నాయి. అంతే తప్ప టీడీపీ అభ్యర్థి రాజ్యసభ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేవన్నది మాత్రం ఆ పార్టీ నేతలు కూడా అంచనాలు వేసుకుంటున్నారు.

బలం లేకపోవడంతో...
ఈ నెల 27వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి వరకూ టీడీపీకి ఉన్న ఒకే ఒక సభ్యుడు పదవీ విరమణ చేయడంతో పాటు అసెంబ్లీలో తగిన బలం లేకపోవడంతో ఈ ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ లేదు. మూడు రాజ్యసభ స్థానాలకు ఇప్పటికే వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. వైసీపీకి 151 మంది సభ్యులున్నారు. టీడీపీకి కేవలం 23 మంది మాత్రమే ఉన్నారు. అందులో నలుగురు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన వారే. దీంతో 19 మంది సభ్యులు మిగిలితే.. అందులో గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదించడంతో 18కే పరిమితమయింది.
అంత మంది సభ్యులు...
రాజ్యసభ స్థానాన్ని గెలుచుకోవాలంటే 41 మంది శాసనసభ్యుల మద్దతు అవసరం. అయితే ఇప్పుడున్న బలాబలాలను చూస్తే మాత్రం టీడీపీకి ఒక్క స్థానం కూడా దక్కే అవకాశం లేదు. అయినా పోటీకి దించి ఎన్నికలకు ముందు పరాభావం పాలవ్వడం ఎందుకన్న భావన టీడీపీ అధినేత చంద్రబాబులో కనిపిస్తుంది. 41 మంది సభ్యులు మద్దుతు కావాలంటే మరో 13 మంది ఎమ్మెల్యేలు వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే అంత పెద్ద సంఖ్యలో మద్దతును కూడగట్టడం ఎన్నికల వేళ కష్టమేనని టీడీపీ నేతలు భావిస్తున్నారు.
మూడు రోజులే...
అందుకనే పోటీలో ఉండాలా? లేదా? అన్నది ఇంకా నిర్ణయించుకోలేదు. నామినేషన్లకు మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ మూడు రోజుల్లో చంద్రబాబు నిర్ణయం తీసుకుంటే నామినేషన్ వేయొచ్చు. లేకుంటే వైసీపీకి మూడు రాజ్యసభ స్థానాలు దక్కే అవకాశముంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినంత సులువు కాదన్న సంగతి చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకే దూరంగా ఉంటారా? లేదా? బరిలోకి దిగుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. పోటీ చేసి ఓటమి పాలయినా తొలి సారి తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ జీరో గా మారనుంది. తిరిగి 2026లో ఖాళీ అయ్యే స్థానాల్లో గెలిస్తే తప్ప అప్పట ివరకూ పెద్దల సభలో పార్టీకి చోటు ఉండదు.


Tags:    

Similar News