పాత మిత్రుల కొత్త పొత్తులు

2019 ఎన్నికల తర్వాత తెగిపోయిన బీజేపీ తెలుగు దేశం బంధం మళ్ళీ పురుడు పోసుకుంది. అయితే గతం లోలా దృఢంగా ఉంటుందా లేక అవకాశవాద రాజకీయాలకు కేంద్రంగా మారుతుందా అనేది వేచి చూడాలి.

Update: 2023-06-12 03:01 GMT

బీజేపీ అధ్యక్షుడు నడ్డా, మరో కీలక నేత అమిత్‌షా రెండు రోజుల వరుస ఆంధ్రప్రదేశ్‌ పర్యటన... పొత్తులపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లయింది. వైఎస్సార్‌ పార్టీని దునుమాడుతూ, ఆ పార్టీ అవినీతిని ఎత్తి చూపిస్తూ మొట్టమొదటిసారి తీవ్ర పదజాలంతో వాళ్లిద్దరూ విరుచుకుపడ్డారు. చంద్రబాబునాయుడు ఢిల్లీలో ఈ ఇద్దరు కీలక నేతల్ని కలిసిన పది రోజుల తర్వాత జరిగిన కీలక రాజకీయ పరిణామం ఇది. గత నాలుగేళ్లుగా తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలనే నడ్డా, షా ద్వయం చేయడం విశేషం. రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే అని గతంలో కోర్టులో కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఇప్పటి వరకూ కేంద్ర పెద్దలు రాజధాని విషయంలో పెదవి విప్పలేదు. తమ పర్యటనలో ఇద్దరు నేతలూ అమరావతికి మద్దతుగా మాట్లాడటం విశేషం. ఇదంతా తెలుగుదేశం స్క్రిప్ట్‌ అని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు.

విశాఖపైనే ప్రేమ ఎందుకు?

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి బలమున్న ప్రాంతాల్లో విశాఖపట్నం ఒకటి. అందుకే అమిత్‌ షా విశాఖ వేదికగా వైకాపాపై ఆరోపణలు గుప్పించారు. అరాచక శక్తుల చేతిలో ఈ నగరం బందీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రాబోయే ఎన్నికల పొత్తులో విశాఖపట్నం ఎంపీ స్థానం నుంచి బీజేపీ పోటీ చేస్తుందనే విషయం నిర్ధారణ అయినట్లేనని అనుకోవచ్చు. గతంలో మూడు సార్లు బీజేపీ విశాఖపట్నం లోక్సభ స్థానాన్ని దక్కించుకుంది.

వెలుగులోకి రాని ఒప్పందం వివరాలు

తెలుగుదేశం, బీజేపీ మధ్య కుదిరిన ఒప్పందం వివరాలు మాత్రం బయటకు రావడం లేదు. తెలంగాణలో తెలుగుదేశం మద్దతు తీసుకుని, ఆంధ్రలో ఆ పార్టీకి మద్దతిచ్చే వ్యూహం ఖరారై ఉండొచ్చని సర్వత్రా వినిపిస్తున్న మాటే. చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన బీజేపీ ఆయన పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తుందనే మాట కూడా చెప్పలేం. గతంలో తెలుగుదేశంతో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా బీజేపీ ఆచితూచి వ్యవహరించవచ్చు. ఈ రెండు పార్టీల మధ్య అనురాగం, ఆప్యాయతలు తెలంగాణ ఎన్నికల తర్వాత మాత్రమే పూర్తి స్థాయిలో వెలుగు చూస్తాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే, చంద్రబాబు మరోసారి చక్రం తిప్పుతారు. ఓడిపోతే మాత్రం కేసీయార్‌ ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెడతారు. మొత్తమ్మీద ఆంధ్ర రాజకీయం మాత్రం రసకందాయంలో పడిరది.

Tags:    

Similar News