Khammam : ఖమ్మం బరిలో హేమాహేమీల మధ్య పోటీ.. సీటు ఎవరికన్నది మాత్రం?

ఖమ్మం పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ లో డిమాండ్ పెరిగింది. పోటీ చేయడానికి ఎక్కువ మంది ఆశావహులు క్యూ కడుతున్నారు

Update: 2024-02-02 04:10 GMT

ఖమ్మం పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ లో డిమాండ్ పెరిగింది. పోటీ చేయడానికి ఎక్కువ మంది ఆశావహులు క్యూ కడుతున్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటంతో పాటు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పది స్థానాలకు గాను తొమ్మిదింటిలో గెలవడంతో కాంగ్రెస్ లో ఎక్కువ మంది ఖమ్మం పార్లమెంటు స్థానంలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఏఐసీసీకి కూడా ఖమ్మం లోక్‌సభ సీటు కోసం అత్యధిక స్థాయిలో దరఖాస్తులు అందాయి. దాదాపు ఇరవై ఐదు మంది దరఖాస్తు చేసుకున్నారంటే ఈ స్థానానికి ఎంత డిమాండ్ ఏర్పడిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్లనే ఈ స్థానానికి డిమాండ్ ఏర్పడింది.

భట్టి సతీమణి నందిని...
ఖమ్మం లోక్‌సభలో పోటీ చేయడానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని కూడా దరఖాస్తు చేసుకున్నారు. తమకు అవకాశం ఇవ్వాలని భట్టి వర్గీయులు కోరుతున్నారు. ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతో తమ కుటుంబం నుంచి పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం కల్పించాలని మల్లు భట్టి విక్రమార్క అధినాయకత్వాన్ని కోరే అవకాశముంది. అదే సమయంలో సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా ఖమ్మం లోక్‌సభ నుంచి పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నారు. తనకు అవకాశం కల్పించాలని, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న తనకు ఛాన్స్ ఇవ్వాలని వీహెచ్ కోరుతున్నారు.
రేణుకతో పాటు...
వీరితో పాటు మాజీ ఖమ్మం పార్లమెంటు సభ్యులు రేణుకా చౌదరి ఎటూ ఉండనే ఉన్నారు. ఇక్కడ తమ సామాజికవర్గమయితే గెలుపు అవకాశాలుంటాయని చెబుతున్నారు. తనకు మరొకసారి అవకాశమివ్వాలని రేణుక కోరుతున్నారు. వీరితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి కూడా తనకు టిక్కెట్ కేటాయించాలని దరఖాస్తు చేసుకున్నారు. సామాజికపరంగా, ఆర్థికంగా బలమైన నాయకుడు కావడంతో ఆయన పేరు కూడా పరిశీలించాలని పొంగులేటి వర్గీయులు కోరుతున్నారు. ఖమ్మం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ కూడా రేసులో ఉన్నారు. ఇలా హేమాహేమీలు అనేక మంది పోటీ పడుతుండటంతో ఎవరిని ఎంపిక చేస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
అందరి అభిప్రాయాలతో...
అయితే బీఆర్ఎస్ నుంచి మరోసారి ప్రస్తుత ఎంపీ నామా నాగేశ్వరరావు పోటీ చేసే అవకాశముంది. ఆయనను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సరిపోయిన నేత కోసం కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది. ఖమ్మం కాంగ్రెస్ లో బయటకు గ్రూపులు లేకపోయినా రేణుక చౌదరికి వ్యతిరేకంగా కొందరు మాత్రం ఆమెకు టిక్కెట్ రాదని కోరుకుంటున్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లా నేతలతో పాటు పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని అభ్యర్థి ఎంపిక ఉండనుంది. మరి ఈసారి ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ అయితే విపరీతంగా ఉంది. అయితే ఎవరికి టిక్కెట్ దక్కుతుందన్నది చివరి నిమిషం వరకూ తేలే పరిస్థితి ఉండదంటున్నారు.


Tags:    

Similar News