Telangana : ఎన్నో ఆశలు పెట్టుకున్న వీహెచ్... చివరకు ఇలా జరిగిందేంటి బాబాయ్?

తెలంగాణ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఇద్దరు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ నాయకత్వం ఖరారు చేసింది.

Update: 2024-02-14 11:50 GMT

తెలంగాణ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఇద్దరు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ నాయకత్వం ఖరారు చేసింది. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ప్రకటించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించడంతో అభ్యర్థులు ఎవరన్నది క్లారిటీ వచ్చింది. కానీ పెద్దాయన, గాంధీ కుటుంబ విధేయుడు వి.హనుమంతరావుకు మాత్రం ఈ ప్రకటన నిరాశ తెచ్చిపెట్టింది. ఇద్దరు అభ్యర్థుల ప్రకటనతో కాంగ్రెస్ రెండు స్థానాలను కైవసం చేసుకునే అవకాశముంది.

ఖమ్మంలో వర్గ విభేదాలకు....
మాజీ కేంద్ర మంత్రిగా రేణుకచౌదరి గత ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పార్టీలో పెద్దగా యాక్టివ్ గా ఉండనప్పటికీ ఎన్నికల సమయంలో మాత్రం ఆమె ఖమ్మం జిల్లాలో ముఖ్యపాత్రనే పోషిస్తారు. అయితే ఖమ్మం జిల్లాలో రేణుక చౌదరి అంటే పడని కాంగ్రెస్ నేతలు కోకొల్లలు. ఆమెకు తిరిగి ఖమ్మం పార్లమెంటు టిక్కెట్ ఇస్తే సొంత పార్టీ నేతలే ఓడిస్తారని భావించి ఆమెను రాజ్యసభకు ఎంపిక చేసి ఉండవచ్చన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఒకరకంగా రేణుక చౌదరికి రాజ్యసభ టిక్కెట్ ఇచ్చి ఖమ్మం పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి చేరువలో ఉందని ఆ పార్టీనేతలే చెబుతున్నారు.
సామాజికవర్గం కోణంలో...
మరోవైపు అనిల్ కుమార్ యాదవ్ కూడా కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉన్నారు. మాజీ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జిల్లా కంంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అయితే సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి మరోసారి పోటీ చేయాలని యాదవ్ కుటుంబ సభ్యులు భావిస్తున్నా వారి కుటుంబంలో ఒకరికి టిక్కెట్ దక్కడంతో అక్కడ కొత్త వారికి ఛాన్స్ దొరకనుంది. యువజన కాంగ్రెస్ లో పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ ను చిన్న వయసులోనే పెద్దల సభకు పంపడేమిటన్న ప్రశ్న తలెత్తినా.. పార్టీలో సామాజికవర్గం కోణంలోనే ఈ ఎంపిక జరిగిందని చెప్పాలి.
అందుకే మౌనంగా...
మరోవైపు రాజ్యసభ టిక్కెట్ పై సీనియర్ నేత, గాంధీ కుటుంబ విధేయుడు వి.హనుమంతరావు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. ఎవరిపైనా విమర్శలు చేయడం లేదు. సొంత పార్టీపైనే విమర్శలు చేసే వీహెచ్ గత కొంతకాలంగా సైలెంట్ గా ఉంది ఈ సీటు కోసమే. సామాజికవర్గం కోణంలో తనకు న్యాయం జరుగుతుందని ఆయన భావించారు. బీసీ కార్డును కూడా వేశారు. అయితే ఆయనకు ఈసారి పార్టీ హ్యాండ్ ఇచ్చింది. వీహెచ్‌ను పక్కన పెట్టడం వెనక ఆయనకు పార్టీలో పదవి ఇవ్వాలన్న నిర్ణయంతోనే రాజ్యసభకు ఎంపిక చేయలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అయితే రాజ్యసభకు ఎంపిక చేసిన అభ్యర్థులను చూసిన వీహెచ్ వర్గం గుర్రుగా ఉంది. మరి వీహెచ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఆయన ఏలా రియాక్ట్ అవుతారన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News