ఆ రెండు పార్టీలు ఇరుకున పడ్డాయా!

తెలంగాణలో కాంగ్రెస్‌ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్తోంది. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన ‘జన గర్జన’ సభ ఊహించిన దానికంటే..

Update: 2023-07-07 03:56 GMT

భారాసా, భాజపా ఒక్కటే అంటూ రాహుల్ వ్యాఖ్యలు 

రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రెస్ క్యాడర్

తెలంగాణలో కాంగ్రెస్‌ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్తోంది. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన ‘జన గర్జన’ సభ ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్‌ కావడం ఆ పార్టీ నేతల్లో కొత్త ఊపు తీసుకువచ్చింది. రాహుల్‌ గాంధీ ముఖ్య అతిధిగా హాజరైన ఖమ్మం సభ ఎన్నికల వాతావరణాన్ని తలపించింది. పీపుల్స్‌ మార్చ్‌ పేరుతో 109 రోజులు,1336 కిలో మీటర్లు సాగిన మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర కూడా కాంగ్రెస్‌ పార్టీకి ప్రయోజనం కలిగించేదే!

కర్నాటక ఎన్నికల్లో భారీ విజయం హస్తం పార్టీకి తెలంగాణపై ఆశలు పుట్టించింది. గత కొంతకాలంగా దక్షిణాదిలో చతికిలపడుతున్న పార్టీకి కన్నడనాట విజయం కొత్త ఊపిరి ఇచ్చింది. ఎన్నికలకు ఆరు నెలల ముందు జూపల్లి కృష్ణారావు లాంటి కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరడం కూడా ఆ పార్టీ క్యాడర్‌కి ఉత్సాహం ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఖమ్మలో భారీ సభ నిర్వహించాలని ప్లాన్‌ చేశారు. అనుకున్నట్లుగానే భారీ సంఖ్యలో హాజరైన జనంతో ఖమ్మం సభ జరిగింది. ఆ ప్రాంతంలో పట్టున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అనుచరగణంతో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ చేసిన ప్రసంగం జాతీయ మీడియాను సైతం ఆకర్షించింది. భారత రాష్ట్ర సమితిని బీజేపీ రిస్తేదార్‌ సమితి అని ఆరోపించడం ద్వారా, రాబోయే ఎన్నికల్లో ఆ రెండు పార్టీల ‘కూటమి’కి తమకూ మధ్యే పోరాటమని ఆయన స్పష్టం చేసినట్లయింది.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో త్రిముఖ పోటీ ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తూ వచ్చాయి. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి మళ్లీ తామే అధికారంలో వస్తామని భారాస ధీమాగా ఉంది. భారాస బీజేపీకి ‘బి’ టీమ్‌ అని ఆరోపించడం ద్వారా తామే ప్రధాన ప్రతిపక్షమని కాంగ్రెస్‌ ప్రకటించింది. ఇది ఇటు భాజపాను అటు కెసిఆర్ పార్టీని ఇరుకున పెట్టింది. ప్రధాన మోదీని తన మిత్రుడని కేసీయార్‌ ప్రకటించడం, పక్షం రోజుల కిందట పట్నాలో జరిగిన ప్రతిపక్షాల సమావేశానికి భారాస హాజరు కాకపోవడం కూడా లాంటి సంఘటనలను ఉదహరిస్తూ కాంగ్రెస్‌ ఆరోపణలు గుప్పిస్తోంది. వై.ఎస్‌.షర్మిలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా రెడ్డి ఓట్లకు గాలం వేయాలని ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది.

ప్రస్తుతానికైతే ఎన్నికల రేసులో కాంగ్రెస్‌ భాజపా కంటే ముందుకు వెళ్తోంది. వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్‌ అంటూ ఆయా వర్గాల ఓటర్లను ఆకర్షిస్తోంది. కాంగ్రెస్‌ దూకుడుకు భాజపా, భారాస ఎలా కళ్లెం వేస్తాయో చూడాలి. కాంగ్రెస్‌ ఖమ్మం సభ ఆ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేసిన మాట మాత్రం వాస్తవం.

Tags:    

Similar News