YSRCP : వసంత వాయిస్ ఛేంజ్ అయిందే.. ఈయనను కూడా తప్పించేటట్లే ఉందే?

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గత కొద్ది రోజులుగా చేస్తున్న కామెంట్లు చూస్తుంటే ఆయనకు కూడా సీటు దక్కడం కష్టమే

Update: 2024-01-30 06:30 GMT

మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గత కొద్ది రోజులుగా చేస్తున్న కామెంట్లు చూస్తుంటే ఆయనకు కూడా సీటు దక్కడం కష్టమేనని తెలుస్తోంది. ఆయనకు తనకు సీటు రాదని తెలిసిన తర్వాతనే వాయిస్ మార్చినట్లు స్పష్టంగా కనపడుతుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తాను ఉంటున్న పార్టీపైన, ప్రభుత్వంపైన నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారంటే దాదాపు అదే అభిప్రాయానికి ఆయన సన్నిహితులు కూడా వచ్చారు. అయితే ఇంకా పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడక పోవడంతో కొంత సంయమనం పాటిస్తున్నట్లు కనిపిస్తున్నా ఆయన మాటలు చూస్తుంటే త్వరలోనే ఆయన కూడా పార్టీకి రాం రాం చెప్పేసేటట్లే కనపడుతుంది.

తొలిసారి గెలిచి...
వసంత కృష్ణప్రసాద్ గత ఎన్నికల్లో మైలవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. అదీ అప్పటి వరకూ ఓటమి ఎరుగని దేవినేని ఉమను ఓడించి వసంత ఒకరకంగా కృష్ణా జిల్లా వైసీపీలో హీరోగా నిలిచారు. వసంత కృష్ణ ప్రసాద్ ది రాజకీయ కుటుంబ నేపథ్యమే. దేవినేని ఫ్యామిలీతో తొలి నుంచి తలపడుతున్నా చాలా రోజుల తర్వాత గెలుపు దక్కింది. నందిగామ సెంటర్ గా రాజకీయాలు చేసిన రెండు కుటుంబాలు అది ఎస్సీ నియోజకవర్గంగా మారడంతో మైలవరానికి షిఫ్ట్ అయ్యారు. కమ్మ సామాజికవర్గ నేతగా వసంత కృష్ణ ప్రసాద్ ఆర్థికంగా కూడా బలమైన నేత. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ స్థిరపడ్డారు.
హైకమాండ్ పంచాయతీ చేసినా...
తొలి నుంచి కాంగ్రెస్‌తోనూ, తర్వాత వైసీపీతోనూ సంబంధాలు నెరుపుతూ వచ్చారు. మధ్యలో టీడీపీకి వెళ్లినా గత ఎన్నికల ముందు వసంత వైసీపీలోకి చేరి మైలవరం టిక్కెట్ ను సాధించుకోగలిగారు. చివరకు నెగ్గారు. అయితే మైలవరం ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జోగి రమేష్‌కు, వసంతకు మధ్య విభేదాలు తలెత్తాయి. మైలవరంలో తన మనుషులకే పదవులును జోగి రమేష్ ఇప్పించుకోవడంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. అధినాయకత్వం పలుమార్లు ఇరువురిని పిలిచి పంచాయతి చేసింది. అయినా చేతులు కలవలేదు. మనస్పూర్తిగా ఇద్దరూ మాట్లాడుకునింది లేదు. కలసి పనిచేసింది లేదు. 2014 ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసి ఓటమి పాలయిన జోగి రమేష్ తన నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడమేంటన్న వసంత ప్రశ్నకు హైకమాండ్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆయనలో అసంతృప్తి మొదలయింది.
జోగిని తెచ్చి...
మంత్రి జోగిరమేష్‌ను కూడా పెడన నుంచి పెనమలూరుకు మార్చారు. అయితే అక్కడ పరిస్థితులు బాగా లేకపోవడంతో జోగి రమేష్ ను మైలవరానికి తీసుకు వచ్చే ప్రతిపాదన కూడా పార్టీలో ఉంది. దీంతో పాటు పలుమార్లు వసంత కృష్ణ ప్రసాద్ సీఎంవోకు వెళ్లి వచ్చారు. అయితే తాజాగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలను చూస్తే పార్టీ ఆయనకు సీటు ఇచ్చేది లేదని అర్థమవుతుంది.వచ్చే నెల 4,5 తేదీల్లో తాను మీడియా సమావేశం పెట్టి మాట్లాడతానని చెప్పిన వసంత సంక్షేమ పధకాలను అమలు చేయడం వల్ల అభివృద్ధి చేయడానికి నిధులు లేవని అన్నారు. ప్రజలు తమకు పథకాలు కాదని, అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారని అనడంతో ఆయన పార్టీ కి గుడ్ బై చెప్పడం ఖాయమని తేలింది. వసంత పార్టీలో ఉంటారా? ఆయనకు టిక్కెట్ వస్తుందా? రాదా? అన్నది మరో నాలుగైదు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.
Tags:    

Similar News