Ashok Gajapathi Raju : రాజకీయాలంటే విసిగిపోయారా.. వాలంటరీగా తప్పుకున్నట్లేనా?

అశోక్ గజపతి రాజు తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్. అయితే ఆయన కొద్దిరోజులుగా కనిపించడం లేదు. వాయిస్ వినిపించడం లేదు

Update: 2024-01-19 14:10 GMT

అశోక్ గజపతి రాజు తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్. చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీలో అత్యంత సీనియర్ అయిన అశోక్ గజపతి రాజు గత కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. విజయనగరం జిల్లా అంటేనే టీడీపీలో మొదట గుర్తొచ్చేది ఆయన పేరే. అలాంటిది అశోక్ గజపతి రాజు పేరు కొద్దికాలం నుంచి వినపడటం లేదు. ఆయన ఎక్కువ సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అప్పుడప్పుడు విజయనగరానికి వచ్చినా పెద్దగా పట్టించుకోవడం లేదు. రాజకీయాలను కూడా పట్టించుకోకుండా ఉన్నారు. ఈసారి అశోక్ గజపతి రాజు పోటీ చేస్తారా? లేదా? అన్నది సందేహంగా మారింది.

కనిపించడం.. వినిపించడం లేదే...
అశోక్ గజపతి రాజును పార్టీ కూడా పట్టించుకోకపోవడం ఇక్కడ విశేషం. మీటింగ్ లలో కనిపించడం లేదు. ఆయన పేరు కూడా ఎక్కడా నేతల నోటి నుంచి ప్రస్తావనకు రావడం లేదు. రాజుగారి శకం రాజకీయంగా ముగిసినట్లేనన్న కామెంట్స్ ఆ పార్టీలో వినపడుతున్నాయి. గత ఎన్నికలలో ఓటమి తర్వాత అశోక్ గజపతి రాజులో కొంత నైరాశ్యం అలుముకుంది. దీంతో పాటు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ట్రస్ట్ విషయంలోనూ జోక్యం చేసుకుంది. న్యాయస్థానాలకు వెళ్లి పోరాడాల్సి వచ్చింది. పార్టీ కొంత మేర అండగా ఉన్నప్పటికీ ఆ తర్వాత పెద్దగా టీడీపీ కూడా పట్టించుకోవడం లేదన్నది ఆయన మనసులో బలంగా నాటుకు పోయింది.
కొత్త తరం రావడంతో...
మరోవైపు పార్టీలో కొత్త రక్తం వస్తుంది. పాత వాళ్లను సాగనంపే ప్రక్రియ మొదలయినట్లేనని అశోక్ గజపతి రాజు గ్రహించినట్లున్నారు. ముఖ్యంగా లోకేష్ వంటి యువనేతలు పార్టీపై పెత్తనం చేస్తున్న సమయంలో తమ మాట చెల్లుబాటు కాదని భావించిన అశోక్ గజపతి రాజు సైడ్ అయిపోయారని అంటున్నారు. గత ఎన్నికల్లో విజయనగరం శాసనసభ నుంచి తన కుమార్తెను, విజయనగరం లోక్‌సభ నుంచి తాను బరిలోకి దిగి ఓటమి పాలయిన తర్వాత కొంత కాలంపాటు యాక్టివ్ గానే ఉన్న పెద్దాయన ఆ తర్వాత పెద్దగా కనిపించడం మానేశారు. రాజకీయాల్లోకి ఇంకా కొనసాగి తనతో పాటు తన కుటుంబానికున్న గౌరవ ప్రతిష్టలను దెబ్బతీయడం ఎందుకని ఆయన ప్రశ్నించుకున్నట్లుంది.
నేటి రాజకీయాల్లో...
ఇప్పటి రాజకీయాలను తాను చేయలేరు. ఆయనలో ఉన్న నిజాయితీ ఆవైపుగా నడవనివ్వదు. డబ్బులు మాత్రమే కాదు.. అబద్ధాలు చెప్పి గెలవగలగాలి. ఆ పని అశోక్ గజపతి రాజు చేయలేరు. ఆయన నైజం తెలిసిన వారికి ఎవరైనా ఇది అర్థమవుతుంది. అందుకే ఆయన కుటుంబ సభ్యలతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. పైగా ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. వయసు మీద పడుతుంది. ఈ తరుణంలో రాజకీయాల్లో చురుగ్గా ఉండలేమని, ఈ తరం నేతలతో నెగ్గుకు రాలేమని భావించి అశోక్ గజపతి రాజు సైలెంట్ అయ్యారంటున్నారు. పార్టీ కూడా ఆయన అలా ఉండి పార్టీకి మద్దతిస్తే సరిపోతుందిలేనని భావిస్తున్నట్లుంది. అందుకే ఆయన పేరు ఎక్కడా వినిపించడం లేదు. ఆయన కూడా కనిపించడం లేదు.


Tags:    

Similar News