పుల్వామా జిల్లాలో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
తీవ్రవాదులు ఉన్నారనే సమాచారంతో మిత్రిగామ్ ప్రాంతంలో బుధవారం నాడు భద్రతా దళాలు అక్కడికి వెళ్లాయి. ఆ సమయంలో ఉగ్రవాదులు
పుల్వామా జిల్లాలోని మిత్రిగామ్ గ్రామంలో గత రాత్రి భద్రతా దళాల చేతిలో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. తీవ్రవాదులు-భద్రతా బలగాల మధ్య చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌లో అల్ బదర్ సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులను ఎజాజ్ హఫీజ్, షాహిద్ అయూబ్‌లుగా గుర్తించినట్లు కశ్మీర్ జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. రెండు ఏకే-47 రైఫిళ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య పుల్వామాలో వలస కూలీలపై వరుస దాడుల్లో పాల్గొన్నారని కుమార్ తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ కారణంగా పుల్వామాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
తీవ్రవాదులు ఉన్నారనే సమాచారంతో మిత్రిగామ్ ప్రాంతంలో బుధవారం నాడు భద్రతా దళాలు అక్కడికి వెళ్లాయి. ఆ సమయంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. జవాన్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రహదులు హతమయ్యారు. మిత్రిగాం గ్రామంలో పండ్లతోట పక్కన మిలిటెంట్లు దాక్కున్నారనే సమాచారం అందడంతో సైన్యం, పోలీసుల బృందాలు బుధవారం మధ్యాహ్నం అక్కడికి చేరుకున్నాయి. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడానికి ప్రయత్నించినప్పుడు వెంటనే ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. తీవ్రవాదుల కాల్పుల్లో మొదట ఒక సైనికుడు గాయపడ్డాడు. అనంతరం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
కొంతమంది పౌరులను అక్కడి నుండి తరలించడానికి కొద్ది సమయం పాటు ఆపరేషన్ నిలిపివేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.ఐజాజ్ హఫీజ్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి 2022 జనవరిలో అదృశ్యమయ్యాడు. జమ్మూ కశ్మీర్ లో ఏప్రిల్ నెలలో పెద్దఎత్తున ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. లష్కర్, జైష్ సంస్థల టాప్ కమాండర్లు సహా 20 మందికి పైగా ఉగ్రవాదులు ఇప్పటివరకు హతమయ్యారు.