టార్గెట్ 2024: విపక్షాల ఐక్యత రాగం!

2024 సాధారణ ఎన్నికల నాటికి బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల కూటమిని పటిష్టం చేయాలన్న లక్ష్యంతో బీహార్ సీఎం నితీష్ కుమార్ వరుసగా విపక్ష

Update: 2023-05-23 00:58 GMT

2024 సాధారణ ఎన్నికల నాటికి బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల కూటమిని పటిష్టం చేయాలన్న లక్ష్యంతో బీహార్ సీఎం నితీష్ కుమార్ వరుసగా విపక్ష నేతలతో సమావేశమవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేను సోమవారం కలుసుకుని చర్చలు జరిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. త్వరలోనే ప్రతిపక్షాల సమావేశం జరగనున్నట్లు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. తేదీని ఒకట్రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. ఈ భేటీకి అన్ని పార్టీలు హాజరవుతాయని అన్నారు.

మరోవైపు ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నీతీశ్‌ కుమార్‌, తేజస్వి యాదవ్‌, ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లాతోపాటు పలు విపక్ష నేతలు హాజరైన విషయం తెలిసిందే. దీని ద్వారా తాము ఐక్యంగా ఉన్నామని చెప్పే ప్రయత్నం విపక్ష పార్టీలు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నితీష్‌తో భేటీకి ముందు కాంగ్రెస్ చీఫ్‌ ఖర్గే ట్వీట్ చేశారు. ఇప్పుడు దేశం సమైక్యంగా ఉంది.. ప్రజాస్వామ్య బలం మా సందేశం అని ట్వీట్ చేశారు. రాహుల్‌గాంధీతో కలిసి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై నితీష్‌కుమార్‌తో చర్చించినట్లు తెలిపారు. దేశానికి కొత్త దిశను అందించే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లామన్నారు.

నితీష్ కుమార్ ఆదివారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కలుసుకుని విపక్షాల ఐక్యతపై చర్చించారు. కేంద్రం జారీచేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పోరాటంచేసేందుకు సిద్ధమైన కేజ్రీవాల్‌కు తన సంఘీభావాన్ని ప్రకటించారు. ఆ మర్నాడే రాహుల్, ఖర్గేలతో ఈ సమావేశం జరగడం ప్రాముఖ్యత సంతరించుకుంది. కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో కలుసుకున్న నితీష్... కేంద్రంతో ఢిల్లీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న సంక్షోభంపై ఆయనకు పూర్తి మద్దతు ప్రకటించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని అంశంపైనా వారిద్దరి మధ్యా చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్రంలో ఎన్డీయే సర్కార్‌కు వ్యతిరేకంగా ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్న విపక్షాలన్నీ త్వరలో సమావేశం కాబోతున్నాయి. అయితే, ఈ సమావేశం ఎక్కడ జరుగుతుంది? ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాన్ని ఒకట్రెండు రోజుల్లో వెల్లడించనున్నట్టు కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలిపారు.

Tags:    

Similar News