Dharmasthala : ధర్మస్థల కేసు వెనుక నిజం ఏమిటి? ఫిర్యాదుదారుడి వెనక ఎవరు?

ధర్మస్థల కేసులో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. సామూహిక అంత్యక్రియల ఫిర్యాదుదారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

Update: 2025-08-23 07:22 GMT

ధర్మస్థల కేసులో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. సామూహిక అంత్యక్రియల ఫిర్యాదుదారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదుదారుడిని అదుపులోకి తీసుకున్న సిట్‌ విచారణ జరపుతున్నట్లు తెలుస్తోంది. 1995 నుంచి 2014 వరకు తాను ధర్మస్థలలో మహిళల మృతదేహాలు పూడ్చానని, ఆ మృతదేహాలు ఎవరివో తనకు తెలియదని పోలీసులకు మాజీ శానిటరీ వర్కర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పుణ్యక్షేత్రమైన ధర్మస్థలకు వచ్చిన మహిళ భక్తుల మృతిపై విచారణ జరపడానికి కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేకంగా స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ఏర్పాటు చేసింది. గత కొన్ని రోజులుగా మృతదేహాలను వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్నారు.

తవ్వకాలు జరిపి...
ఫిర్యాదు ఆధారంగా ధర్మస్థలలో పలుచోట్ల తవ్వకాలు జరుపుతున్నారు. అయితే తవ్వకాల్లో ఎలాంటి అస్థిపంజరాలు లభించలేదని సిట్ అధికారులు చెప్పారు.ఫిర్యాదుదారుడు చెప్పినవి అబద్ధాలేనని తేల్చిన సిట్ అసలు ఎందుకు ఫిర్యాదుదారుడు ఈ రకమైన ఆరోపణలు చేశాడన్న దానిపై ఆరా తీస్తున్నారు. అయితే ఫిర్యాదు దారుడు మాత్రం తన వద్దకు ఒక ముసుగు వ్యక్తి వచ్చి డబ్బులు ఇచ్చి ఇలా ఫిర్యాదు చేయాలని చెప్పాడని పోలీసులతో చెప్పినట్లు తెలిసింది.మరొకవైపు రెండు దశాబ్దాల క్రితం దర్మస్థలకు వచ్చిన తమ కుమార్తె కనిపించకుండా పోయిందంటూ సుజాత భట్ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది కూడా అబద్ధమని పోలీసుల విచారణలో తేలింది.
జాతీయ స్థాయిలో దుమారం...
కర్ణాటక రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ధర్మస్థల వివాదం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. దర్మస్థలకు రోజుకు వేల మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ మంజునాధస్వామి దేవాలయానికి దేశం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా ప్రపంచంలోని పర్యాటకులు కూడా ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడ సముద్ర తీరం కూడా ఉండటంతో పర్యాటకుల సంఖ్య నిత్యం ఎక్కువగా ఉంటుంది.అయితే ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ధర్మస్థలిలో ఇలాంటి ఘటనలు జరగడంపై ప్రభుత్వంపై అనేక విమర్శలు కూడా వచ్చాయి. గత రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో నాలుగు వందల యాభై మంది అదృశ్యమయినట్లు వివిధ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదులు అందినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే సిట్ విచారణలో అదంతా శుద్ధ అబద్ధమని తేలినట్లు సిట్ అధికారులు తెలిపారు. ఈ ప్రచారం వెనక ఎవరున్నారన్నదానిపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు.


Tags:    

Similar News