Operaton Sindoor : మరోసారి పాక్ విఫలయత్నం.. భారత్ ధీటైన సమాధానం
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ఇంకా దాడులకు దిగుతూనే ఉంది. అయితే భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ఇంకా దాడులకు దిగుతూనే ఉంది. గురువారం రాత్రి 36 చోట్ల చోట్లకు దాడులకు ప్రయత్నించిన పాక్ శుక్రవారం రాత్రి 26 చోట్ల అటాక్ చేయడానికి యత్నించింది. రాత్రి వేళల్లో మాత్రమే పాక్ దాడులకు దిగుతుంది. ప్రధానంగా భారత్ లోని విమానాశ్రయాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు యత్నించింది. డ్రోన్లతో దాడులకు దిగేందుకు ప్రయత్నించిన పాక్ కు తగిన రీతిలో భారత వాయుసేన బుద్ధి చెప్పింది. బారాముల్లా నుంచి భుజ్ వరకూ మొత్తం ఇరవై ఆరు ప్రాంతాల్లో పాక్ దాడులకు ప్రయత్నించినట్లు సైన్యం తెలిపింది. శ్రీనగర్ విమానాశ్రయంతో పాటు అవంతిపుర వైమానిక స్థావరాన్ని పేల్చి వేయడానికి పాక్ కుట్ర పన్నింది.
సక్సెస్ ఫుల్ గా...
అయితే పాక్ పంపిన డ్రోన్లను భారత సైన్యం విజయవంతంగా నిర్వీర్యం చేయగలిగింది. జమ్మూ, ఫిరోజ్ పూర్, పఠాన్ కోట్, జై సల్మేర్, బాడ్ మేడ్, భుజ్ ప్రాంతాలపైకి డ్రోన్లను పంపేందుకు పాక్ ప్రయత్నించి మరోసారి విఫలమయింది. పాక్ కు రెండో రోజు కూడా చేదు అనుభవమే మిగిలింది. సరిహద్దు రాష్ట్రాల్లో ముందుగా అప్రమత్తమయిన భారత సైన్యం అక్కడ బ్లాక్ అవుట్ ను ప్రకటించారు. ఎవరూ ఇళ్లలో నుంచి రాకుండా సూచనలు చేశారు. అలాగే సరిహద్దు జిల్లా సాంబా జిల్లాల్లో కూడా పెద్దయెత్తున కాల్పుల మోతలు వినిపించాయి. ఫిరంగుల మోతలతో మారుమోగిపోయింది.
తిప్పికొట్టడంతో...
అఖ్నూర్, జైసల్మేర్, జమ్మూ, ఫజిల్కా, జలంధర్,మెగా, హోశియాపూర్, అమృత్ సర్, ఫిరోజ్ పుర్, పంచ్ కుల, అంబాలా వంటి ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ ను ప్రకటించారు. అనేక సరిహద్దు జిల్లాల్లో విద్యుత్తు సరఫరాను నిలిపేశారు. గాల్లోనే పాక్ పంపిన డ్రోన్లను నిర్వీర్యం చేయడంతో పెద్దముప్ప తప్పినట్లయింది. భారత వాయుసేన నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పాక్ కుటిల యత్నాలను సమర్ధవంతంగా తిప్పికొట్టగలిగింది. నిఘా వర్గాల సమాచారం మేరకు ముందు నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న భారత ఆర్మీ ఈ మేరకు డ్రోన్లు కనిపించిన వెంటనే వాటిని కూల్చివేయడంతో పాక్ ప్రయత్నాలు ఫలించలేదు.