భేష్ .. పాతికేళ్లకే జడ్జి అయిన దినసరి కూలీ కుమార్తె..

కర్ణాటకలోని బంగారపేటకు చెందిన నారాయణస్వామి, వెంకట రత్నమ్మల ఏకైక కుమార్తె గాయత్రి. తల్లిదండ్రులు..

Update: 2023-01-19 13:17 GMT

civil judge gayatri

దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్.. విద్యార్థులకు చెప్పిన ఓ మాట.. ‘కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి’. దానిని స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది యువత తమ కలల్ని సాకారం చేసుకుంటున్నారు. అలాగే ఓ యువతి కూడా తన కలని సాకారం చేసి చూపించింది. పేద కుటుంబంలో పుట్టానన్న బాధ లేకుండా.. పేదరికం చదువుకు అడ్డుకాదని నిరూపిస్తూ.. పాతికేళ్లకే సివిల్ కోర్టులో జడ్జి అయింది. కూతురిని చూసుకుని ఆ తండ్రి తెగ మురిసిపోతున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని బంగారపేటకు చెందిన నారాయణస్వామి, వెంకట రత్నమ్మల ఏకైక కుమార్తె గాయత్రి. తల్లిదండ్రులు ఇద్దరూ రోజువారి కూలి పనులకు వెళ్లి సంపాదించిన కొద్దిపాటి డబ్బుతోనే కూతుర్ని చదివించారు. తల్లిదండ్రుల తపనను అర్థం చేసుకున్న గాయత్రి.. తల్లిదండ్రులు గర్వించే స్థాయికి ఎదగడంతో పాటు.. తన జీవితానికి బంగారుబాట వేసుకోవాలని సంకల్పించింది. యళబుర్గికి చెందిన గాయత్రి.. ఎన్‌.కారహళ్లిలోని గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంది. కోలారు ఉమెన్స్ కాలేజీలో బీకాం పూర్తి చేసింది. కేజీఎఫ్‌లోని కెంగల్‌ హనుమంతయ్య కాలేజీలో 2021లో లా పూర్తి చేసింది. యూనివర్శిటీలోనే నాలుగో ర్యాంక్ సాధించింది.
సీనియర్ న్యాయవాది శివరాం సుబ్రహ్మణ్యం వద్ద ఆమె జూనియర్‌ న్యాయవాదిగా పనిచేసింది గాయత్రి. ఆమెలో ఉన్న ప్రతిభ, పట్టుదల గమనించిన న్యాయవాది శివరాం సుబ్రహ్మణ్యం సివిల్‌ న్యాయమూర్తి పరీక్షలకు హాజరు కావటానికి చదవాల్సిన పుస్తకాలను ఇచ్చి ప్రోత్సహించారు. ఆమెకు అన్ని రకాలుగాను సహకరించారు. 2021లోనే సివిల్‌ జడ్జి పోస్టులకు నిర్వహించిన డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంది. కానీ.. ఫెయిల్ అయింది. నిరాశ చెందకుండా.. రెండోమారు ప్రయత్నించి.. అనుకున్నది సాధించింది. 25 ఏళ్లకే సివిల్ కోర్టు న్యాయమూర్తిగా నియమితురాలై.. తన సీనియర్ లాయర్ సుబ్రహ్మణ్యం, తన తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టింది. ఇప్పుడు యావత్ దేశం.. ఆమె గురించి మాట్లాడుకునేట్టుగా ఎదిగింది. సంకల్పిస్తే.. సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించింది.





Tags:    

Similar News