Kerala : నేడు కేరళలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు
తొలి దశ కేరళ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది
తొలి దశ కేరళ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ దశలో తిరువనంతపురం, కొల్లం, పథానం తిట్ట, అలప్పుఝ, కొట్టాయం, ఇదుక్కి, ఎర్నాకుళం మొత్తం ఏడు జిల్లాల్లో ఓటింగ్ జరుగుతోంది. రెండో దశ పోలింగ్ డిసెంబర్ 11వ తేదీన ఉంటుంది. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 13న జరగనుంది. ఈసారి ఎన్నికలను రెండు దశల్లో నిర్వహిస్తున్నారు. తొలి దశలో 11,168 వార్డులు, రెండో దశలో 12,408 వార్డుల్లో పోలింగ్ జరుగుతుంది. కేంద్ర మంత్రి సురేష్ గోపీ తిరువనంతపురంలో తన ఓటు వేశారు.
మొదటి దశలో...
కేరళలోని మొత్తం 1,199 స్థానిక సంస్థల్లో ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి. వాటిలో మొదటి దశలో 595 స్థానిక సంస్థలకు సంబంధించిన 11,168 వార్డుల్లో పోలింగ్ జరుగుతోంది. వీటిలో 471 గ్రామపంచాయతీలకు 8,310 వార్డులు, 75 బ్లాక్ పంచాయతీలకు 1,090 వార్డులు, ఏడు జిల్లా పంచాయతీలకు 164 వార్డులు, 39 మున్సిపాలిటీలకు 1,371 వార్డులు, తిరువనంతపురం, కొల్లం, కొచ్చి నగరాల్లోని మూడు కార్పొరేషన్లకు 233 వార్డులు ఉన్నాయి.