2023లో కార్ల విక్రయాల్లో 2019 రికార్డు బ్రేక్
పీవీ సెగ్మెంట్ లో గతేడాది 30,69,499 యూనిట్ల అమ్మకాలు జరగ్గా.. ఈసారి 26.72 శాతం వృద్ధి నమోదైంది. 2023 అర్థిక సంవత్సరంలో ..
2023 cars sales in india
సొంతిల్లు, సొంత కారు చాలా మంది కల. సొంతింటి సంగతి పక్కన పెడితే.. సాటి మధ్యతరగతి కుటుంబాలు కూడా ఈ రోజుల్లో సొంతంగా కార్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో రికార్డు స్థాయిలో కార్ల అమ్మకాలు జరిగాయి. 2019 రికార్డును ఈ అమ్మకాలు బ్రేక్ చేశాయి. మారుతీ సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, కియా ఇండియా దేశీయ విపణిలో రికార్డు అమ్మకాలను నమోదు చేశాయి.
పీవీ సెగ్మెంట్ లో గతేడాది 30,69,499 యూనిట్ల అమ్మకాలు జరగ్గా.. ఈసారి 26.72 శాతం వృద్ధి నమోదైంది. 2023 అర్థిక సంవత్సరంలో పీవీ విభాగంలో అత్యధికంగా స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్ యూవీ) అమ్ముడయ్యాయి. ఈ విభాగంలో 43.02 శాతం వాటాతో 16,73,488 యూనిట్లను ఆయా సంస్థలు వినియోగదారులకు అందించాయి. 2019లో ఎస్ యూవీ వాహనాలు 7,83,119 యూనిట్లతో పీవీ విభాగంలో 23.19 శాతం అమ్ముడయ్యాయి. మూడేళ్లలో అది రెట్టింపు కావడం గమనార్హం. కరోనా తర్వాత కార్లకు డిమాండ్ పెరగడంతో పాటు.. కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకురావడంతో ఏడాది ఆరంభంలో కార్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ఇండియా 2023 ఆర్థిక సంవత్సరంలో 16,06,870 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను అందించి అగ్రస్థానంలో ఉంది. ఇక హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ విపణిలో 5,67,546 యూనిట్లతో రెండోస్థానంలో నిలువగా.. 5,38,640 యూనిట్లతో టాటా మోటార్స్ ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ప్యాసింజర్ వాహనాలను అమ్మింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కియా అత్యధికంగా 2,69,229 యూనిట్లను ఉత్పత్తి చేసింది. మొత్తం మీద 2023 ఆర్థిక సంవత్సరంలో 38.39 లక్షల కార్ల విక్రయాలు జరిగాయి. 2019 ఆర్థిక సంవత్సరంలో 33,77,436 విక్రయాల రికార్డును ఇది అధిగమించింది.