ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమై నెల రోజులు దాటింది. అయినా దాడులు ఆగలేదు. ఇరాన్ మద్దతుతో ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు శనివారం మధ్యప్రాచ్య యుద్ధంలోకి ప్రవేశించారు. ఇజ్రాయెల్‌పై రెండు క్షిపణులు ప్రయోగించినట్లు ప్రకటించారు. ఇదే సమయంలో సుమారు 2,500 మంది అమెరికా మెరైన్లు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. యుద్ధాన్ని ఆపే మార్గాలపై చర్చించేందుకు ప్రాంతీయ దేశాలు ఆదివారం సమావేశం కానున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం తెలిపింది. ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజ వాయువు సరఫరాలను ప్రభావితం చేసింది. ఎరువుల కొరత, విమాన రవాణా అంతరాయం చోటుచేసుకుంది. వ్యూహాత్మక ప్రాధాన్యం గల హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యం మార్కెట్లను, ధరలను కుదిపేసింది. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తున్నాయి. ప్రతిగా ఇరాన్ ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ అరబ్ దేశాలపై దాడులు చేస్తోంది. ఇప్పటివరకు 3,000 మందికి పైగా మరణించారు.
హౌతీల ప్రవేశంతో...
హౌతీల ప్రవేశం ప్రపంచ వాణిజ్య రవాణాపై మరింత ప్రభావం చూపే అవకాశముంది. ఎర్ర సముద్రం వద్ద బాబ్ ఎల్ మండెబ్ జలసంధి గుండా సాధారణంగా ప్రపంచ వాణిజ్యంలో 12 శాతం రవాణా జరుగుతుంది. అక్కడ నౌకలను లక్ష్యంగా చేసుకునే అవకాశంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి మేరకు శుక్రవారం ఇరాన్ ఆ జలసంధి గుండా మానవతా సహాయం, వ్యవసాయ సరుకుల రవాణాకు అనుమతి ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 6లోగా జలసంధి తెరవాలని ఇరాన్‌కు గడువు ఇచ్చారు. శనివారం రాత్రి టెహ్రాన్‌లో భారీ దాడులు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కీలక ఆయుధ ఉత్పత్తి కేంద్రాలను కొద్ది రోజుల్లో పూర్తిగా లక్ష్యంగా చేసుకుంటామని ఇజ్రాయెల్ సైన్యం ముందుగా తెలిపింది. ఈ యుద్ధంలో ఇరాన్‌కు చెందిన 11,000కిపైగా లక్ష్యాలపై దాడులు చేసినట్లు అమెరికా ప్రకటించింది.
ఇజ్రాయిల్ పైకి క్షిపణులు...
ఇరాన్ ఇజ్రాయెల్ వైపు క్షిపణులు ప్రయోగించింది. గల్ఫ్ దేశాల గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి.హౌతీ బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సరీ తమ అల్ మసీరా టీవీ ద్వారా దక్షిణ ఇజ్రాయెల్‌లోని సున్నితమైన సైనిక స్థావరాలపై క్షిపణులు ప్రయోగించినట్లు చెప్పారు.వాణిజ్య నౌకలపై హౌతీలు దాడులు పెంచితే చమురు ధరలు పెరిగే ప్రమాదం ఉందని యెమెన్ నిపుణుడు అహ్మద్ నాగి హెచ్చరించారు. ఇది కేవలం ఇంధన మార్కెట్‌కే పరిమితం కాదని అన్నారు. బాబ్ ఎల్ మండెబ్ జలసంధి సుయేజ్ కాలువకు వెళ్లే నౌకలకు కీలకం. హార్ముజ్ జలసంధి మూసివేత కారణంగా సౌదీ అరేబియా రోజుకు లక్షల బారెల్ల చమురును ఇదే మార్గంలో పంపుతోంది. 2023 నవంబర్ నుంచి 2025 జనవరి మధ్య హౌతీలు 100కుపైగా వాణిజ్య నౌకలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేశారు. రెండు నౌకలు మునిగిపోయాయి. గాజాలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ సమయంలో ప్యాలస్తీనీయులకు మద్దతుగా ఈ చర్యలు చేపట్టామని హూతీలు పేర్కొన్నారు.
నేడు ఇస్లామాబాద్ లో చర్చలు...
యెమెన్ రాజధాని సనా 2014 నుంచి హౌతీల ఆధీనంలో ఉంది. యెమెన్ నిర్వాసిత ప్రభుత్వానికి మద్దతుగా 2015లో సౌదీ అరేబియా యుద్ధం ప్రారంభించింది. ప్రస్తుతం తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లో ఉంది. దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్ దేశాల విదేశాంగ మంత్రులు ఆదివారం ఇస్లామాబాద్‌కు చేరుకొని రెండు రోజుల చర్చలు జరపనున్నారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ప్రాంతీయ ఉద్రిక్తతలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. అయితే తాజా దౌత్య ప్రయత్నాలపై తమకు అనుమానాలున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ టర్కీ విదేశాంగ మంత్రికి ఫోన్‌లో చెప్పారు. అమెరికా అనుచిత డిమాండ్లు చేస్తోందని, పరస్పర విరుద్ధ చర్యలు చేపడుతోందని ఆరోపించారు.
అమెరికా తరుపున...
అమెరికా తరఫు ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ ఇరాన్‌కు 15 అంశాల కార్యాచరణ జాబితా ఇచ్చినట్లు తెలిపారు. హార్ముజ్ జలసంధి తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమంపై పరిమితులు విధించడం ఇందులో ఉన్నాయని చెప్పారు. ఇరాన్ దీన్ని తిరస్కరించి ఐదు అంశాల ప్రతిపాదన ఇచ్చింది. అందులో పరిహారం, జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించడం ఉన్నాయి. అమ్ఫిబియస్ దాడులపై శిక్షణ పొందిన 2,500 మంది మెరైన్లతో అమెరికా నౌకలు చేరుకున్నాయి. 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్‌కు చెందిన 1,000 మంది పరాచూట్ సైనికులను కూడా మధ్యప్రాచ్యానికి తరలించారు. భూసైన్యం అవసరం లేకుండానే లక్ష్యాలను సాధించగలమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు.
సౌదీ అరేబియాలో దాడుల్లో...
సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై ఇరాన్ దాడుల్లో గత వారం రెండు దశాబ్దాలకుపైగా అమెరికా సైనికులు గాయపడ్డారు. ఆ స్థావరంపై ఆరు బాలిస్టిక్ క్షిపణులు, 29 డ్రోన్లు ప్రయోగించినట్లు సమాచారం. కనీసం 15 మంది గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమం. ఈ వారం రెండుసార్లు అక్కడ దాడులు జరిగాయని సమాచారం. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 300కుపైగా అమెరికా సైనికులు గాయపడ్డారు. కనీసం 13 మంది మరణించారు.ఇరాన్‌లో 1,900 మందికి పైగా మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్‌లో 19 మంది మృతిచెందారు. లెబనాన్‌లో 1,100 మందికి పైగా మరణించారు. ఇరాన్ మద్దతు గల మిలీషియా చేరిన ఇరాక్‌లో 80 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారు. గల్ఫ్ దేశాల్లో 20 మంది, వెస్ట్ బ్యాంక్‌లో నలుగురు మరణించారు.