వినియోగదారులకు షాక్ .. పెట్రోలు ధరలు తగ్గవు

వాహనదారులకు పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో ఎలాంటి ఊరట లభించలేదు

Update: 2026-03-28 02:24 GMT

వాహనదారులకు పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో ఎలాంటి ఊరట లభించలేదు. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు పది రూపాయల చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. అయితే, ఈ తగ్గింపు ప్రయోజనం వినియోగదారులకు చేరదని, రిటైల్ ధరలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎదుర్కొంటున్న భారీ నష్టాలను భర్తీ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

నష్టాల్లో ఉన్న...
ప్రస్తుత అంతర్జాతీయ ధరల ప్రకారం, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి సంస్థలు లీటర్ పెట్రోల్‌పై సుమారు రూ. 26, లీటర్ డీజిల్‌పై రూ. 81.90 చొప్పున నష్టపోతున్నాయి. ఈ కంపెనీలు రోజుకు మొత్తంగా రూ. 2,400 కోట్ల నష్టాన్ని భరిస్తున్నాయని మంత్రిత్వ శాఖ వివరించింది. తాజాగా తగ్గించిన రూ.10 ఎక్సైజ్ సుంకం ఈ నష్టాల్లో కొంత భాగాన్ని భర్తీ చేస్తుందని, దీనివల్ల సరఫరాకు అంతరాయం కలగకుండా చూసుకోవచ్చని పేర్కొంది.ప్రపంచ ఇంధన పరిస్థితిని నిశితంగా గమనిస్తూ, వినియోగదారులకు సరఫరా, ధరల స్థిరత్వాన్ని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్రం హామీ ఇచ్చింది.


Tags:    

Similar News