శుక్రవారం టెహ్రాన్‌పై తన దాడులను “మరింత విస్తరించి, తీవ్రతరం చేస్తాం” అని హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ ఇరాన్ అణు సదుపాయాలపై దాడులు చేసింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన ఇరాన్, సౌదీ అరేబియాలోని ఒక స్థావరంపై దాడి చేసింది. ఈ ఘటనలో అమెరికా సైనికులు గాయపడ్డారు. కొన్ని విమానాలకు నష్టం వాటిల్లింది. యుద్ధం నెల రోజులు దాటిన సమయంలో మాత్రం ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐక్యరాజ్యసమితి అభ్యర్థన మేరకు హోర్ముజ్ జలసంధి మార్గం నుంచిమానవతా సహాయం, వ్యవసాయ సరుకు రవాణాకు అనుమతి ఇస్తామని ఇరాన్ ప్రకటించింది. జెనీవాలో ఐక్యరాజ్యసమితి వద్ద తమ దేశ రాయబారి అలీ బహ్రేని ఈ విషయాన్ని వెల్లడించారు. “అత్యవసర సహాయం ఆలస్యం కాకుండా చేరేందుకు ఇరాన్ కట్టుబడి ఉంది” అని ఆయన ‘ఎక్స్’లో పేర్కొన్నారు. యుద్ధ ప్రభావంతో సహాయ సరఫరాలపై వచ్చిన అంతరాయాలపై చర్యల కోసం ఐక్యరాజ్యసమితి ఇప్పటికే ప్రత్యేక బృందం ఏర్పాటు చేసింది.
చమురు రవాణాలో...
ప్రపంచ చమురు రవాణాలో ఐదో వంతు, ఎరువుల వాణిజ్యంలో మూడో వంతు ఈ జలసంధి గుండా జరుగుతుంది. చమురు, వాయువు సరఫరాల అడ్డంకులపై దృష్టి పడుతున్నప్పటికీ, ఎరువుల సరఫరా తగ్గితే ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, ఆహార భద్రత దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై ఇరాన్ దాడిలో కనీసం 10 మంది అమెరికా సైనికులు గాయపడ్డారని అమెరికా అధికారులు తెలిపారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఇంధనం నింపే విమానాలకు కూడా నష్టం జరిగినట్లు సమాచారం.
అణు కేంద్రాలపై దాడులు...
ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపిన వివరాల ప్రకారం అరాక్‌లోని షాహిద్ ఖోందాబ్ హెవీ వాటర్ సముదాయం, యజ్ద్ ప్రావిన్స్‌లోని ఆర్దకాన్ యెల్లోకేక్ తయారీ కేంద్రంపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఎవరూ మృతి చెందలేదని, కాలుష్యం ప్రమాదం లేదని తెలిపింది. అరాక్ కేంద్రం గత ఏడాది జూన్‌లో జరిగిన దాడుల తర్వాత కార్యకలాపాలు నిలిచిపోయాయి. యెల్లోకేక్ అనేది యురేనియం శుద్ధి తర్వాత పొందే ఘన రూపం. హెవీ వాటర్ అణు రియాక్టర్లలో ఉపయోగిస్తారు. యజ్ద్ కేంద్రంలో అణు ఇంధన తయారీకి ముడిసరుకులు సిద్ధం చేస్తారని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. “ఇజ్రాయెల్ చేసిన నేరాలకు ఇరాన్ భారీ మూల్యం వసూలు చేస్తుంది” అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ‘ఎక్స్’లో హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయెల్‌కు అనుబంధ సంస్థల్లో పనిచేసేవారు తమ ఉద్యోగాలు వదిలేయాలని ఇరాన్ విప్లవ గార్డుల వైమానిక దళాధిపతి సెయెద్ మజీద్ ముసావీ సూచించారు.శుక్రవారం రాత్రి ఇరాన్ క్షిపణులు ప్రయోగించడంతో ఇజ్రాయెల్‌లోని బీర్ షెబా పరిసరాల్లో సైరన్లు మోగాయి. గత వారాంతంలో దాడులు జరిగిన అణు పరిశోధనా కేంద్రం సమీప ప్రాంతాల్లో ప్రజలు ఆశ్రయం పొందాల్సి వచ్చింది.
దౌత్య చర్చలు, ఆర్థిక ప్రభావం...
మియామీలో జరిగిన కార్యక్రమంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్, సౌదీ మధ్య సంబంధాల సాధారణీకరణ అవసరాన్ని మళ్లీ ప్రస్తావించారు. ఇరాన్‌తో ఉద్రిక్తతలు ముగిశాక ఈ ప్రక్రియ సాధ్యమవుతుందని అన్నారు. అయితే పాలస్తీనా రాష్ట్ర ఏర్పాటుకు స్పష్టమైన మార్గం ఉండాలని సౌదీ అరేబియా పట్టుబడుతోంది. యుద్ధం వల్ల ప్రపంచ మార్కెట్లపై ప్రభావం కనిపిస్తోంది. అమెరికా స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో వారంలో నష్టాలు చవిచూశాయి. చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికాలో గ్యాస్ ధరలు గ్యాలన్‌కు 4 డాలర్లకు చేరువయ్యాయి. ఫెడరల్ ఇంధన పన్నును తాత్కాలికంగా నిలిపివేయాలని కాంగ్రెస్ సభ్యులు కోరుతున్నారు. అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్ పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో 15 అంశాల కార్యాచరణ జాబితాను ఇరాన్‌కు అందజేసినట్లు తెలిపారు. అణు కార్యక్రమంపై నియంత్రణ, హోర్ముజ్ మార్గం తిరిగి తెరవడం అందులో ఉన్నాయి. ఇరాన్ దీనిని తిరస్కరించి, తన ఐదు అంశాల ప్రతిపాదనలో పరిహారం, జలసంధిపై తన సార్వభౌమాధికారాన్ని గుర్తించాలనే డిమాండ్ పెట్టింది.
కొనసాగుతున్న టెన్షన్...
తూర్పు టెహ్రాన్‌లో వైమానిక దాడుల తర్వాత కొంతసేపు విద్యుత్ అంతరాయం ఏర్పడిందని సాక్షులు తెలిపారు. టెల్ అవీవ్‌లో పలు చోట్ల పేలుళ్లు వినిపించాయి. ఒక వ్యక్తి తీవ్ర గాయాలతో మరణించినట్లు అత్యవసర సేవలు తెలిపాయి. సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ రియాద్‌పై దాడి చేసిన క్షిపణులు, డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపింది. లెబనాన్‌లో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. కువైట్‌లోని షువైఖ్ పోర్టు, నిర్మాణంలో ఉన్న ముబారక్ అల్ కబీర్ పోర్టుకు దెబ్బతగిలింది. పాకిస్థాన్, టర్కీ సహా పలు దేశాలు అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య ప్రత్యక్ష భేటీకి ప్రయత్నిస్తున్నాయి. ఫ్రాన్స్‌లో సమావేశమైన జీ7 విదేశాంగ మంత్రులు ప్రజలు, మౌలిక సదుపాయాలపై దాడులు తక్షణం ఆపాలని కోరారు. అమెరికా అదనపు సైన్యాన్ని మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది. 2,500 మేరీన్లు, 82వ ఎయిర్‌బోర్న్ దళానికి చెందిన సైనికులు మోహరించడానికి సిద్ధమయ్యారు. భూదళాల అవసరం లేకుండానే లక్ష్యాలు సాధ్యమవుతాయని విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో తెలిపారు.
మృతుల సంఖ్య...
లెబనాన్ దక్షిణ భాగానికి ఇజ్రాయెల్ 162వ డివిజన్‌ను పంపింది. హిజ్బుల్లా దాడులను అరికట్టడం లక్ష్యమని తెలిపింది. ఐక్యరాజ్యసమితి వలసల సంస్థ వివరాల ప్రకారం ఇరాన్‌లో 82,000 పౌర భవనాలు, 1.8 లక్షల మంది నివాసాలు దెబ్బతిన్నాయి. యుద్ధం కొనసాగితే భారీ మానవతా విపత్తు తప్పదని నార్వేజియన్ శరణార్థుల మండలి హెచ్చరించింది. ఇజ్రాయెల్‌లో 18 మంది, లెబనాన్‌లో 1,100 మందికిపైగా, ఇరాన్‌లో 1,900 మందికిపైగా మరణించినట్లు అధికారులు తెలిపారు. అమెరికా సైనికులు 13 మంది మృతి చెందారు.