Israel - Iran War : క్షిపణి దాడులను కొనసాగిస్తున్న ఇరాన్...సౌదీ సైనిక స్థావరంపై అటాక్

ఇరాన్ శుక్రవారం కూడా ఇజ్రాయెల్, గల్ఫ్ అరబ్ దేశాలపై క్షిపణి దాడులు కొనసాగించింది

Update: 2026-03-28 01:58 GMT

ఇరాన్ శుక్రవారం కూడా ఇజ్రాయెల్, గల్ఫ్ అరబ్ దేశాలపై క్షిపణి దాడులు కొనసాగించింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణి, డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడిలో కనీసం పది మంది అమెరికా సైనికులు గాయపడ్డారని అమెరికా అధికారులు తెలిపారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. స్థావరంలో ఉన్న అమెరికా ఇంధన నింపే విమానాలకు కూడా నష్టం వాటిల్లిందని వెల్లడించారు.ఇదే సమయంలో ఇజ్రాయెల్ ఇరాన్‌పై తన దాడులను మరింత విస్తరిస్తామని హెచ్చరించింది. అమెరికా సైన్యం కూడా ఇరాన్‌పై దాడులు కొనసాగించింది. అయితే హోర్ముజ్ జలసంధిని మూసివేసిన అంశంపై ఇరాన్ ఇంధన కేంద్రాలను ధ్వంసం చేస్తామని చేసిన హెచ్చరికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాయిదా వేశారు.స్టాక్ మార్కెట్ ఒత్తిడి మధ్య ట్రంప్ ఏప్రిల్ 6వ తేదీ వరకు గడువు పొడిగించారు. చర్చలు బాగా జరుగుతున్నాయని, ఇరాన్ స్వయంగా ఈ గడువు కోరిందన్నారు. అయితే ఇరాన్ మాత్రం తాము అమెరికా వైట్ హౌస్‌తో చర్చలు జరపడం లేదని బహిరంగంగా చెబుతోంది.

వెస్ట్ బ్యాంక్‌లో ముగ్గురు మృతి
ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని ఖలాండియా శరణార్థి శిబిరం ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడిలో 22 ఏళ్ల యువకుడు మృతి చెందాడని పాలస్తీనా ఆరోగ్యశాఖ తెలిపింది. అంత్యక్రియల సమయంలో ముసుగులు ధరించిన కొందరు గాల్లో కాల్పులు జరిపారు. ఆ తరువాత మళ్లీ దాడి జరిగినప్పుడు మరో వ్యక్తి మృతి చెందాడని వెల్లడించింది. ఇక ధీషే శరణార్థి శిబిరం వద్ద జరిగిన మరో దాడిలో 15 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇజ్రాయెల్ సైన్యం మాత్రం రాళ్లు విసిరిన వారిపై కాల్పులు జరిపామని, కీలకంగా ప్రేరేపించిన వారిని లక్ష్యంగా చేసుకున్నామని పేర్కొంది.
“నేను శాంతి దూతనే” : ట్రంప్
తన వారసత్వంపై ప్రశ్నించగా ట్రంప్ “నేను గొప్ప శాంతి దూతగా గుర్తుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడలా కనిపించకపోయినా నేను శాంతి దూతనే అని నమ్ముతున్నాను” అని వ్యాఖ్యానించారు. కాగా ఇరాన్ శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం వరుసగా మూడు సార్లు క్షిపణి దాడులు చేసింది. జెరూసలేం, టెల్ అవీవ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిలో 52 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. మరికొందరు గాయపడ్డారు.
టెహ్రాన్‌లో విద్యుత్ అంతరాయం...
ఇరాన్ రాజధాని టెహ్రాన్ తూర్పు ప్రాంతాల్లో వైమానిక దాడుల తరువాత విద్యుత్ అంతరాయం చోటుచేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.ఖోందాబ్ వద్ద ఉన్న హెవీ వాటర్ ప్లాంట్‌పై దాడి జరిగినప్పటికీ ప్రమాదం లేదని ఐఏఈఏ తెలిపింది. యెల్లోకేక్ ఉత్పత్తి కేంద్రంపై దెబ్బతగిలిందని పరిశీలిస్తున్నామని వెల్లడించింది.ఇరాన్ మద్దతుతో ఉన్న హౌతీ సైనిక ప్రతినిధి యాహ్యా సరే ఈ యుద్ధంలో అవసరమైతే ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటామని హెచ్చరించారు.జెనీవాలో ఐక్యరాజ్యసమితికి ఇరాన్ రాయబారి అలీ బహ్రేని మానవతా సహాయక సరుకుల రవాణాకు హోర్ముజ్ జలసంధి ద్వారా అనుమతిస్తామని తెలిపారు.అమెరికా మార్కెట్లు వరుసగా ఐదో వారం నష్టాల్లో ముగిశాయి. S&P 500 సూచీ 1.6% పడిపోయింది. చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి.టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ ఈ వారాంతంలో పాకిస్తాన్‌లో ఈజిప్ట్, సౌదీ, పాకిస్తాన్ విదేశాంగ మంత్రులతో సమావేశం కానున్నట్లు తెలిపారు.


Tags:    

Similar News