Israel - Iran War : ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు.. ప్రతీకారం తీర్చుకుంటామని టెహ్రాన్ హెచ్చరిక
ఇజ్రాయెల్‌పై యెమెన్ నుంచి ప్రయోగించిన క్షిపణిని తమ రక్షణ వ్యవస్థ అడ్డుకుందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది
ఇజ్రాయెల్‌పై యెమెన్ నుంచి ప్రయోగించిన క్షిపణిని తమ రక్షణ వ్యవస్థ అడ్డుకుందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఆ దేశం నుంచి ఇదే మొదటి దాడి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ దాడికి ఇరాన్ మద్దతుతో ఉన్న హౌతీ తిరుగుబాటు దళాలు బాధ్యత స్వీకరించాయి. దీంతో రెడ్‌సీ మార్గంలో వాణిజ్య నౌకాయానాన్ని మళ్లీ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం వరకు బీర్ షెబా పరిసరాలు, ఇజ్రాయెల్ ప్రధాన అణు పరిశోధనా కేంద్రం దగ్గర మూడోసారి సైరన్లు మోగాయి. ఇదే సమయంలో ఇరాన్, హెజ్‌బొల్లా నుంచి ఇజ్రాయెల్‌పై కాల్పులు కొనసాగాయి.
హౌతీలు నేరుగా...
హౌతీలు 2014 నుంచి యెమెన్ రాజధాని సనా నియంత్రణలో ఉంచుకున్నారు. సౌదీ అరేబియా 2015లో యుద్ధం ప్రారంభించిన తర్వాత, ఇటీవలి సంవత్సరాల్లో హౌతీలు నేరుగా యుద్ధంలో పాల్గొనలేదు. అయితే ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ సమయంలో రెడ్‌సీ మార్గంలో నౌకలపై క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించి అంతర్జాతీయ రవాణాను అతలాకుతలం చేశారు. ఇటీవల ఇరాన్‌పై దాడులను విస్తరించనున్నట్లు హెచ్చరించిన ఇజ్రాయెల్, కొన్ని గంటలకే ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేసింది. దీనికి ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించడంతో అమెరికా సైనికులు గాయపడ్డారు. హౌతీల సైనిక ప్రతినిధి యహ్యా సరే అల్ మసీరా టీవీలో మాట్లాడుతూ దక్షిణ ఇజ్రాయెల్‌లోని “సున్నితమైన సైనిక కేంద్రాలు” లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించామని తెలిపారు. ఈ యుద్ధంలో చేరనున్నట్లు ముందే సంకేతాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
టెలీ అవీవ్.. జెరూసలేంలో పేలుళ్లు...
ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఇరాన్ అణు శక్తి సంస్థ, అరాక్‌లోని షహీద్ ఖోండాబ్ హెవీ వాటర్ సముదాయం, యజ్ద్ ప్రావిన్స్‌లోని అర్దకాన్ యెల్లోకేక్ ప్లాంట్ దెబ్బతిన్నట్లు ప్రకటించింది. ప్రాణనష్టం లేదని తెలిపింది. అయితే యజ్ద్ కేంద్రం ఇరాన్ అణు కార్యక్రమానికి కీలకమని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఇక టెల్ అవీవ్, జెరూసలేం ప్రాంతాల్లో పేలుళ్లు వినిపించాయి. అత్యవసర సిబ్బంది పలు ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నారు. ఈ యుద్ధ నేరానికి ఇరాన్ భారీ మూల్యం చెల్లిస్తుందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ హెచ్చరించారు. ఇరాన్ దాడుల వల్ల గత వారం రోజులలో సౌదీ స్థావరాల్లో ఉన్న అమెరికా సైనికుల్లో పలువురు గాయపడ్డారని సమాచారం. మొత్తం 29 డ్రోన్లు, ఆరు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు తెలుస్తోంది.
హార్ముజ్ జలసంధిలో...
ఈ పరిణామాల మధ్య హార్ముజ్ జలసంధిలో మానవతా సహాయం, వ్యవసాయ సరుకుల రవాణా అనుమతించేందుకు ఇరాన్ అంగీకరించినట్లు ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ ప్రతినిధి అలీ బహ్రెయ్ని తెలిపారు. ఎరువుల సరఫరా ఆగిపోతే ప్రపంచ ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.యుద్ధం విస్తరించే అవకాశాల నేపథ్యంలో అమెరికా నౌకాదళం, మెరైన్లు, పారా ట్రూపర్లను మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది. భూసేనలు అవసరం లేకుండానే లక్ష్యాలు సాధించగలమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు.లెబనాన్, ఇరాన్, ఇజ్రాయెల్‌లలో మరణాల సంఖ్య పెరుగుతోంది. వేలాది భవనాలు దెబ్బతిన్నాయి. లక్షలాది మంది నిర్వాసితులయ్యే ప్రమాదం ఉందని మానవతా సంస్థలు హెచ్చరిస్తున్నాయి.