North Korea : చర్చల విఫలం తర్వాత టార్గెట్ అమెరికా.. స్వయంగా పరీక్షించిన అధినేత

ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ అమెరికాను లక్ష్యంగా చేసుకునే క్షిపణుల సామర్థ్యాన్ని స్వయంగా పరీక్షించారు

Update: 2026-03-29 02:21 GMT

ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ అమెరికాను లక్ష్యంగా చేసుకునే క్షిపణుల సామర్థ్యాన్ని స్వయంగా పరీక్షించారు. అధిక సామర్థ్యంతో పనిచేసే ఘన ఇంధన ఇంజిన్‌ భూమిపై చేసిన పరీక్షను స్వయంగా వీక్షించారు. ఇది దేశ వ్యూహాత్మక సైనిక సామర్థ్యాన్ని పెంచే కీలక అభివృద్ధి అని ఆయన ప్రశంసించినట్లు అధికార వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ఆదివారం వెల్లడించింది.ఈ పరీక్ష అమెరికా ప్రధాన భూభాగాన్ని చేరగల క్షిపణుల సామర్థ్యాన్ని పెంచి, ఆయుధ సంపత్తిని విస్తరించాలనే కిమ్‌ సంకల్పాన్ని సూచిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఉత్తర కొరియా పార్లమెంట్‌లో కిమ్‌ చేసిన ప్రసంగంలో దేశాన్ని శాశ్వత అణు శక్తిగా నిలబెట్టే దిశగా అడుగులు వేస్తామని చెప్పారు. మధ్యప్రాచ్య యుద్ధాన్ని ప్రస్తావిస్తూ అమెరికాపై ‘రాష్ట్ర ఉగ్రవాదం, దాడి ధోరణి’ ఆరోపణలు చేశారు. కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం కార్బన్‌ ఫైబర్‌ పదార్థంతో అప్‌గ్రేడ్‌ చేసిన ఈ కొత్త ఇంజిన్‌ గరిష్ఠంగా ఒత్తిడి 2,500 కిలోటన్నులుగా నమోదైంది. సెప్టెంబరులో జరిగిన ఇలాంటి ఘన ఇంధన ఇంజిన్‌ పరీక్షలో ఇది సుమారు 1,971 కిలోటన్నులుగా ఉండేది.

బహుళ వార్‌హెడ్‌ల దిశగా...
ఇంజిన్‌ శక్తిని పెంచడం వెనుక ఒకే క్షిపణిలో అనేక అణు వార్‌హెడ్‌లను అమర్చి, అమెరికా రక్షణ వ్యవస్థలను దాటిచెప్పే అవకాశాన్ని పెంచాలనే యత్నం ఉన్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. పరీక్ష ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనే వివరాలు కెసీఎన్‌ఏ వెల్లడించలేదు. ఐదేళ్ల సైనిక విస్తరణ ప్రణాళికలో భాగంగా ఈ పరీక్ష నిర్వహించినట్లు తెలిపింది. ఈ ప్రణాళికలో “వ్యూహాత్మక దాడి సామర్థ్యాల” మెరుగుదల ప్రధాన లక్ష్యమని పేర్కొంది. దీనర్థం అమెరికా ఖండాన్ని లక్ష్యంగా చేసుకున్న అణు సామర్థ్యంతో కూడిన అంతర్మహాద్వీప క్షిపణుల అభివృద్ధి అని అర్థమవుతోంది. కిమ్‌ తాజా ఇంజిన్‌ పరీక్ష దేశ వ్యూహాత్మక సైనిక బలాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తుందని వ్యాఖ్యానించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.ఇటీవలి సంవత్సరాల్లో ఉత్తర కొరియా పలు రకాల అంతర్మహాద్వీప క్షిపణులను ప్రయోగించింది. ఘన ఇంధన క్షిపణులు ముందస్తు గుర్తింపును కష్టతరం చేస్తాయి. పాత ద్రవ ఇంధన క్షిపణులను ప్రయోగానికి ముందు ఇంధనం నింపాల్సి రావడం వల్ల అవి ఎక్కువసేపు సిద్ధంగా ఉండలేవు.
ట్రంప్‌ తో చర్చల తర్వాత వేగం...
కొంతమంది విదేశీ నిపుణుల అభిప్రాయం ప్రకారం వాతావరణంలో తిరిగి ప్రవేశించే సమయంలో వార్‌హెడ్‌లు ఎదుర్కొనే తీవ్ర పరిస్థితులను తట్టుకునే సాంకేతిక సామర్థ్యం ఇంకా ఉత్తర కొరియాకు పూర్తిగా సిద్ధం కాలేదని అంటున్నారు. అయితే మరికొందరు దీన్ని ఖండిస్తూ, ఎన్నేళ్లుగా అణు, క్షిపణి కార్యక్రమాలు కొనసాగుతున్నందున ఈ సవాళ్లను అధిగమించి ఉండవచ్చని భావిస్తున్నారు. 2019లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కిమ్‌ జరిపిన చర్చలు విఫలమైన తర్వాత ఉత్తర కొరియా అణు ఆయుధ విస్తరణపై మరింత దృష్టి పెట్టింది. ఫిబ్రవరిలో జరిగిన వర్కర్స్‌ పార్టీ సమావేశంలో ట్రంప్‌తో సంభాషణలకు తలుపులు తెరిచే అవకాశం ఉందని కిమ్‌ చెప్పినా, ముందుగా అణు నిరాయుధీకరణను షరతుగా పెట్టవద్దని వాషింగ్టన్‌కు సూచించారు.


Tags:    

Similar News