Delhi : ఢిల్లీ బోర్డర్ లో టెన్షన్ టెన్షన్.. రైతులు vs పోలీసులు

రైతుల ఢిల్లీ ముట్టడి ఉద్రిక్తతలకు దారి తీసింది. శంభు సరిహద్దుల వద్ద హైటెన్షన్ నెలకొంది

Update: 2024-02-14 05:33 GMT

రైతుల ఢిల్లీ ముట్టడి ఉద్రిక్తతలకు దారి తీసింది. శంభు సరిహద్దుల వద్ద హైటెన్షన్ నెలకొంది. పోలీసులకు, రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది, రైతులు ఈ నెల 13న చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపు నివ్వడంతో సరిహద్దులను మూసివేశారు. ఢిల్లీ బోర్డర్‌లో ముళ్లకంచెలను, సిమెంటు దిమ్మెలను ఏర్పాటు చేశారు. అయితే ఢిల్లీ వైపు వస్తున్న రైతులపై నిన్న టియర్ గ్యాస్ ప్రయోగించారు. డ్రోన్లతో టియర్ గ్యాస్ ఉపయోగించడంతో పోలీసుల మీదకు రైతులు రాళ్లు రువ్వారు.

సరిహద్దుల్లో ఉద్రిక్తత...
శంభు సరిహద్దుల్లోనే రైతులు బైఠాయించారు. పంజాబ్, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి పెద్దయెత్తున రైతులు వచ్చి అక్కడకు చేరుకుంటుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా ఢిల్లీ సరిహద్దుల వద్ద పహారా కాస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీలోకి అనుమతించేది లేదని, వస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అయినా కనీస మద్దతుధరకు చట్టబద్ధత కల్పించాలని, స్వామినాధన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని కోరుతూ రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. రోడ్డుపైనే బైఠాయించి అక్కడే ఆందోళనకు దిగడంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.


Tags:    

Similar News