India : విమాన ప్రయాణికులకు భారీ ఊరట

విమాన షెడ్యూళ్లలో అంతరాయం కొనసాగుతుండడంతో పౌర విమానయాన శాఖ శుక్రవారం తక్షణ చర్యలు చేపట్టింది.

Update: 2025-12-06 04:00 GMT

విమాన షెడ్యూళ్లలో అంతరాయం కొనసాగుతుండడంతో పౌర విమానయాన శాఖ శుక్రవారం తక్షణ చర్యలు చేపట్టింది. డీజీసీఏ జారీ చేసిన ఫ్లైట్‌ డ్యూటీ టైమ్‌ లిమిటేషన్స్‌ ఆదేశాలు వెంటనే అమలు నిలిపివేసింది. ఈ నిర్ణయం ఎలాంటి భద్రతా రాజీ లేకుండా తీసుకున్నట్లు శాఖ తెలిపింది. పెద్దలు, విద్యార్థులు, రోగులు వంటి సమయానుకూల ప్రయాణంపై ఆధారపడే ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గించడమే లక్ష్యమని స్పష్టం చేసింది. సాధారణ కార్యకలాపాలు త్వరగా పునరుద్ధరించేందుకు పలు ఆపరేషనల్‌ చర్యలు అమల్లోకి వచ్చాయి.

షెడ్యూల్ లు యధాతధంగా...
రేపటికి షెడ్యూళ్లు స్థిరపడతాయని, మూడురోజుల్లో సేవలు పూర్తిగా సవ్యంగా నడుస్తాయని శాఖ అంచనా వేసింది. ఎయిర్‌లైన్స్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రయాణికులకు సమయానుసార సమాచారం ఇవ్వాలని, ఆన్‌లైన్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ను మరింత మెరుగుపర్చాలని సూచించారు. దీంతో ప్రయాణికులు ఇంటి నుంచే ఫ్లైట్‌ స్థితిని చూసే వీలుంటుంది. ఫ్లైట్‌ రద్దయిన సందర్భంలో ప్రయాణికులు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా పూర్తి రీఫండ్‌ ఆటోమేటిక్‌గా జారీ చేయాలని ఆదేశించారు. దీర్ఘకాలం ఆలస్యానికి గురైన వారి కోసం హోటల్‌ వసతి కల్పించాలని ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించారు.


Tags:    

Similar News