మిస్ ఇండియాకు కరోనా.. మిస్ వరల్డ్ పోటీలు వాయిదా
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా ఇప్పుడు ప్రపంచ సుందరి పోటీలపై పంజా విసిరింది.
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా ఇప్పుడు ప్రపంచ సుందరి పోటీలపై పంజా విసిరింది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన పలువురు కోవిడ్ బారిన పడటంతో మిస్ వరల్డ్ పోటీలు వాయిదా పడ్డాయి. వైరస్ బారిన పడిన వారిలో భారత్ నుంచి వెళ్లిన మిస్ ఇండియా 2020 మానస వారణాసికి కూడా ఉన్నారు. ఈ విషయాన్ని నిర్వాహకులు మిస్ వరల్డ్ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.
నిన్నటి నుంచి...
2021 డిసెంబర్ 16వ తేదీ నుంచి మిస్ వరల్డ్ 2021 పోటీలు ప్రారంభమవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీ దారులు 17 మందితో పాటు సిబ్బందికి కరోనా నిర్థారణవ్వడంతో.. పోటీలను వాయిదా వేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. తిరిగి 90 రోజుల తర్వాత అంటే.. సుమారు 3 నెలల తర్వాత పోటీలను రీ షెడ్యూల్ చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని మిస్ ఇండియా ఆర్గనైజేషన్ కూడా అధికారికంగా ధృవీకరించింది.
ఐసొలేషన్ లో చికిత్స...
మిస్ ఇండియా 2020 మానస వారణాసి ప్రస్తుతం ప్యూర్టోరికోలో ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని హైదరాబాద్ కు చెందిన మానస వారణాసి (23), ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మిస్ ఇండియా 2020 పోటీల్లో విజేతగా నిలిచింది. ఇప్పుడు భారత్ తరపున 70వ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు ఆమె ప్యూర్టోరికో వెళ్లారు.