ఏ మాత్రం తగ్గని విద్యార్థుల ఆగడాలు.. కత్తులతో రైలులోనూ, రైల్వే స్టేషన్ లోనూ

Update: 2022-10-12 01:51 GMT

పోలీసుల వార్నింగ్ లు.. కళాశాల యాజమాన్యం బెదిరింపులను ఆ విద్యార్థులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మేమింతే.. మాకెవరైనా అడ్డొస్తే ఏమైనా జరగొచ్చు అనే విధంగా ప్రవర్తిస్తూనే వస్తున్నారు. ఇప్పటికే పలు విద్యార్థులు ఇలాంటి రచ్చ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. పదునైన ఆయుధాలతో రైలులోనూ.. రైల్వే స్టేషన్స్ లోనూ విన్యాసాలు చేస్తూ కెమెరాకు చిక్కిన చెన్నైలోని ముగ్గురు కళాశాల విద్యార్థులను అరెస్టు చేసినట్లు డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) ప్రకటించారు. చేతిలో కొడవలితో ముగ్గురు వ్యక్తులు కదులుతున్న రైలు ఫుట్‌బోర్డ్‌కు వేలాడుతున్న వీడియో కొన్ని రోజుల క్రితం వైరల్‌గా మారింది. ఆ ముగ్గురు వ్యక్తులు గుమ్మిడిపూండికి చెందిన అన్బరసు, రవిచంద్ర, పొన్నేరికి చెందిన అరుల్‌గా అధికారులు గుర్తించారు. వీరంతా ప్రెసిడెన్సీ కాలేజీ విద్యార్థులని డీఆర్‌ఎం తెలిపారు. ముగ్గురు విద్యార్థులు పదునైన ఆయుధాలను నేలకు తాకిస్తూ నినాదాలు చేయడం క్లిప్‌లో కనిపించింది. వారు రైలు కోచ్‌పై కొడవలితో కొట్టడం కూడా కనిపించింది.

"రైళ్లలో లేదా రైల్వే ప్రాంగణాలను ఇలా దుర్వినియోగం చేయడం.. ప్రమాదకరమైన విన్యాసాలను చేస్తున్న వారిని సహించలేము" అని DRM అన్నారు. "దయచేసి అటువంటి వ్యక్తులపై @rpfsrmas లేదా @grpchennaiకి ఫిర్యాదు చేయడానికి ముందుకు రండి. మా ప్రయాణికుల భద్రతకు మేము కట్టుబడి ఉన్నాము" అని అధికారులు తెలిపారు.
ఇటీవలి కాలంలో రైళ్లలో దురుసుగా ప్రవర్తించే ప్రయాణికులపై అధికారులు చర్యలు తీసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలో, ముంబై రైలులోని మహిళా కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణీకుల మధ్యన గొడవ జరిగింది. థానే-పన్వేల్ లోకల్ ట్రైన్‌లో మహిళలు ఒకరితో ఒకరు ఘర్షణ పడుతున్న దృశ్యం వైరల్‌గా మారింది. వివాదాన్ని పరిష్కరించేందుకుజోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ పోలీసు మహిళపై కొందరు మహిళా ప్రయాణికులు దాడి చేయడంతో ఆమె కాస్తా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News