కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. గాయపడితే.. లక్షన్నర నగదు రహిత చికిత్స

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి నగదు రహిత చికిత్స అందించాలని నిర్ణయించింది

Update: 2025-05-07 11:08 GMT

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి నగదు రహిత చికిత్స అందించాలని నిర్ణయించింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి లక్షన్నర వరకూ నగదు రహిత ఉచిత చికిత్సను అందించడానికి వీలుకల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ను జారీ చేసింది. సోమవారం నుంచే ఇది అమలులోకి వచ్చిందని తెలిపింది. ప్రమాదం జరిగిన ఏడు రోజుల్లోగా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని పేర్కొంది. నిర్దేశిత ప్రమాణాలు కలిగి, నమోదైన ఏ ఆసుపత్రిలోనైనా చికిత్స పొందవచ్చని తెలిపింది.

వేల సంఖ్యలో...
రోడ్డు ప్రమాదాల్లో నిత్యం వేల సంఖ్యలో గాయపడుతున్నారు. వందల సంఖ్యలో మృత్యువాత పడుతుండగా మరికొందరు గాయాలపాలవుతున్నారు. గాయపడిన వారు ఆసుపత్రలలో చేరి వాటికి బిల్లులు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. స్థోమత ఉన్నవారు తప్పించి సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు కార్పొరేట్ వైద్యం అందక పోవడంతో పాటు తాము కోలుకోవడానికి అప్పులు చేయాల్సి వస్తుంది. గాయపడిన వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలులోకి తెచ్చింది. ఇకపై రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి లక్షన్నర వరకూ నగదు రహిత చికిత్సను అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో బాధితులకు వెసులుబాటు లభించినట్లయింది.
నోడల్ ఏజెన్సీగా...
పోలీసులు, ఆసుపత్రులు, స్టేట్‌ హెల్త్‌ ఏజెన్సీల సహకారంతో రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకాన్ని జాతీయ ఆరోగ్య సంస్థ అమలు చేస్తుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర రోడ్డు భద్రతా మండలి నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.పథకం అమలు, ఆసుపత్రులను పథకంలో చేర్చడం, బాధితులకు చికిత్స, ఆసుపత్రులకు చెల్లింపులు తదితర అన్ని విషయాలను ఎన్‌హెచ్‌ఏతో సమన్వయం చేసుకొనే బాధ్యత ఈ నోడల్‌ ఏజెన్సీదే. పథకం అమలు తీరుతెన్నులను పరిశీలించడానికి స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో ఇది మాత్రం పేదలు, సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు ఒకరకంగా మేలు చేసే నిర్ణయమనే చెప్పాలి. అన్ని రాష్ట్రాలూ ఈపథకాన్ని అమలుచేయాల్సి ఉంటుంది.


Tags:    

Similar News